వేధింపుల కేసులో బాక్సర్‌కు జైలుశిక్ష

27 Oct, 2018 09:10 IST|Sakshi
పెదబయలు పీహెచ్‌సీలో కల్యాణి

నిందితుడు ఆసియాడ్‌లో పాల్గొన్న బాక్సింగ్‌ క్రీడాకారుడు

మరో ముగ్గురు కుటుంబ సభ్యులకూ జైలుశిక్ష

విశాఖపట్నం, పీఎంపాలెం(భీమిలి): బాక్సింగ్‌ క్రీడలో పతకాలు తీసుకు వచ్చిన యువకుడు కట్టుకున్న భార్యకు ప్రేమాభిమానాలు కనబరచడంలో విఫలమయ్యాడు. వివాహ బంధానికి తూట్లు పొడిచాడు. భర్త గొప్ప క్రీడాకారుడని ఎంతో మురిసిపోయిన యువతికి నరకం చూపించాడు. కట్న పిశాచిలా మారాడు. అమ్మాయి తరఫువారు ఎంతగా ప్రాధేయ పడినా.. అడిగినప్పుడల్లా  కానులు సమర్పించినా మనసు కరగలేదు. బాక్సర్‌ అయిన భర్త పెట్టే హింసలు తాళలేక న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిది. కేసును విచారించిన  భీమిలి  న్యాయ స్థానం నేరం రుజువవడంతో వీరోతి సంతోష్‌కుమార్‌ అనే అంతర్జాతీయ బాక్సర్‌తో పాటు ఇదే కేసులో మరో ముగ్గురు కుటుంబసభ్యులకు న్యాయమూర్తి ఏడాది జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ రూ. 2500  జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు.

ఇందుకు సంబంధించి స్థానిక సీఐ. కె.లక్ష్మణమూర్తి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వేపగుంట సాయిమాధవ్‌నగర్‌కు చెందిన వీరోతి సంతోష్‌కుమార్‌ (27)అంతర్జాతీయ స్థాయి బాక్సర్‌. ఆసియాడ్‌లో పతకాలు సాధించాడు. ఎన్నో అవార్డులు అందుకున్నాడు.అతని క్రీడా ప్రతిభను కేంద్రప్రభుత్వం గుర్తించి ఆర్మీ లో సుబేదార్‌ హోదా ఉద్యోగం ఇచ్చింది. ఇది ఇలా ఉండగా మధురవాడకు చెందిన వి.మారుతీ ప్రసాద్‌ తన కుమార్తె మణిరత్నానికి బాక్సర్‌ సంతోష్‌ కుమార్‌కు 2014 డిసెంబరు 12న  వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు. వధువు కన్నవారు ఉన్నంతలో కట్నకానుకలు, కారు  సమర్పించారు. అయినా సంతోష్‌కుమార్‌కు అతని తండ్రి విశ్వనాథంకు కట్నం దాహం తీరలేదు.

నిత్యం అదనపు కట్నం కోసం వేధించేవారు. సూటి పోటి మాటలతో హింసించేవారు. పండగలు, పబ్బాలకు కన్నవారింటికి పంపించేవారు కాదు.నరకం చూపించేవారు. కుమార్తెకు పెట్టే హింసలు చూసి కన్నవారు అక్కున చేర్చుకున్నారు. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు 2016 ఆగస్టే 23న పీఎంపాలెం  పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ నిమిత్తం  భీమిలి కోర్టులో చార్జిషీటు దాకలు చేశారు. నేరారోపణలు రుజువు కావడంతో భీమునిపట్నం 16వ అడిషనల్‌ మెట్రో పాలిటన్‌ మెజిస్ట్రేట్‌ బాక్సింగ్‌ క్రీడాకారుడు సంతోషకుమార్, అతని తల్లిదండ్రులు విశ్వనా«థం,ఈశ్వరమ్మతో పాటు సోదరుడు భాను అప్పలగణేష్‌(అలియాస్‌ గణేష్‌ల)కు వరకట్న నిషేధ చట్టం కింద, 498 కింద  ఏడాది జైలుశిక్ష, రూ. 2500లు వంతున జరిమానా విధిస్తూ తీర్పుచెప్పారని సీఐ లక్ష్మణమూర్తి తెలిపారు.

>
మరిన్ని వార్తలు