చట్టవిరుద్ధంగా బాలుడి స్వీకరణ

22 Jun, 2018 13:28 IST|Sakshi
బాలుడిని స్వాధీనం చేసుకుంటున్న సీడీపీఓ

బాలుడిని స్వాధీనం చేసుకున్న ఐసీడీఎస్‌ అధికారులు

పోలీసుస్టేషన్లో ఫిర్యాదు.. కేసు నమోదు  

ఒంగోలు చైల్డ్‌లైన్‌కు శిశువు తరలింపు

కనిగిరి: ఏడేళ్లుగా పిల్లలు లేక తిరుగుతున్న ఓ నిరక్షరాస్య జంట.. బిడ్డను వదలించుకోవాలనే ఓ బాధ్యత రహిత్యం గల తల్లి.. వెరసి ఓ బాలుడిని చట్టవిరుద్ధ దత్తత శ్రీకారానికి దారితీసింది. వాస్తవానికి ఆ బాలుడు దత్తతస్వీకర్తల వద్ద అల్లారుముద్దుగా పెరుగుతున్నా.. ఆ నోట ఈనోట విషయం ఐసీడీఎస్‌ అధికారుల దృష్టికి చేరింది. ఐసీడీఎస్‌ అధికారులు బాలుడిని దత్తత తీసుకున్న దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన గురువారం కనిగిరిలో వెలుగు చూసింది. ఈ మేరకు పోలీసుస్టేషన్లో ఐసీడీఎస్‌ అధికారులు బాలుడిని స్వాధీనం చేసుకుని ఒంగోలు డీసీపీఓకు అప్పగించారు. వివరాలు.. హెచ్‌ఎంపాడు మండలం వేములపాడుకు చెందిన ధనలక్ష్మి, చెన్నకేశవులు దంపతులకు పెళ్లి జరిగి ఏడేళ్లయినా సంతానం లేరు.

కూలీనాలి చేసుకుని జీవించే వీరు పిల్లల కోసం ఆస్పత్రిల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో వేములపాడుకు చెందిన లారీ డ్రైవర్‌ అంకయ్య.. వేరే ప్రాంతం నుంచి వెన్నపూస ధనలక్ష్మిని (రెండో భార్యగా, వివాహం లేదు) తెచ్చుకుని సహజీవనం చేస్తున్నాడు. వీరికి మూడు నెలల బాబు ఉన్నాడు. ఈ క్రమంలో కొద్దికాలం నుంచి అంకయ్యకు, వెన్నపూస ధనలక్ష్మికి మనస్పర్థలు వచ్చి రోజూ గోడవపడి కొట్టుకుంటున్నారు. ధనలక్ష్మి కూలి పనులకు వెళ్లే మహిళలతో తన బిడ్డను ఎవరికైనా ఇస్తానని చెబుతోంది. పిల్లలు లేక ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న ధనలక్ష్మి అత్త తిరుపాలమ్మకు కొందరు విషయం చేరవేశారు. ధనలక్ష్మి కూడా తిరుపాలమ్మకు ఫోన్‌ చేసింది. ఈ నెల 11న కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్‌లో చెట్టు వద్ద వెన్నపూసల ధనలక్ష్మి తన బిడ్డను ఇష్టపూర్వకంగా ఇస్తున్నానని.. ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి మూడు నెలల బాలుడిని అప్పగించింది.

ఐసీడీఎస్‌ అధికారులకు సమాచారం
వేములపాడులో సెక్టార్‌ సమావేశానికి వెళ్లిన సీడీపీఐ లక్ష్మీప్రసన్న దృష్టికి బాలుడి దత్తత విషయం వెళ్లింది. ఆమె విచారణ చేపట్టి వారి ఇంటికి వెళ్లి ప్రశ్నించింది నిరక్ష్యరాస్యులైన తిరుపాలమ్మ, కొడలు ధనలక్ష్మిలు జరిగిన విషయాన్ని పూర్తిగా చెప్పారు. నగదు ఇచ్చి బాలుడిని చట్టవిరుద్ధ దత్తతగా(కొనుగోలు చేయడం) నేరంగా తెలిపి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు పోలీసుస్టేషన్‌లో మూడు నెలల బాలుడిని సీడీపీఓకు అప్పగించారు. బాలల సంరక్షణ కార్యాలయానికి సమాచారం అందించారు. డీసీపీఓ జిల్లా అధికారి జ్యోతి సుప్రియకు బాలుడిని అప్పగించినట్లు సీడీపీఓ లక్ష్మీప్రసన్న విలేకరులకు తెలిపారు.

అత్త, కొడలిపై కేసు
రూ.20 వేలు ఇచ్చి అత్త, కొడలు తిరుపాలమ్మ, ధనలక్ష్మిలు  చట్టవిరుద్ధంగా బాలుడిని కొనుగోలు చేశారని ఐసీడీఎస్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీడీపీఓ ఫిర్యాదు మేరకు అత్త, కోడలిపై  సెక్షన్‌ 81 బాలల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు విలేకరులకు తెలిపారు.

మరిన్ని వార్తలు