లారీ రూపంలో కబళించిన మృత్యువు

11 Feb, 2019 07:43 IST|Sakshi
ఘటనా స్థలంలోనే మృతి చెందిన బాలుడు వెంకటసాయి, ప్రమాదంలో ధ్వంసమైన కారు

ఎదురుగా వెళుతున్న కారును ఢీకొట్టిన లారీ

అదుపుతప్పి స్కూటర్‌పైకి దూసుకెళ్లిన కారు

బాలుడు మృతి, నలుగురికి గాయాలు

పశ్చిమగోదావరి, తణుకు:మృత్యువు ఎలా ముంచుకొస్తుందో చెప్పలేం.. రోడ్డుపై మన తప్పేమీ లేకుండా వెళుతున్నా ఊహించని రీతిలో ప్రమాదం ముంచుకొచ్చింది. ఆదివారం ఇదే తరహాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. తణుకు పట్టణ పరిధిలోని 16వ నంబర్‌ జాతీయ రహదారిపై ఏఎంసీ చెక్‌పోస్టు సమీపంలో జరిగిన ప్రమాదంలో పెరవలి మండలం కాపవరం గ్రామానికి చెందిన చాగంటి తేజశ్రీవెంకటసాయి (4) అనే బాలుడు ఘటనా స్థలంలోనే మృతి చెందగా తల్లిదండ్రులు ఆనందరాజు, సునీత స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఇదే ప్రమాదంలో కారులో వెళుతున్న గాదిరెడ్డి సువర్ణబిందు, నాగమణి దంపతులకు గాయాలయ్యాయి.

ప్రమాదానికి కారణమైన లారీ ఆపకుండానే వెళ్లిపోవడంతో వాహనం ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాపవరం గ్రామానికి చెందిన చాగంటి ఆనందరాజు, సునీత దంపతులు తమ పెద్ద కుమారుడు వెంకటసాయితో కలిసి స్కూటర్‌పై తణుకు బయలుదేరారు. రావులపాలెం నుంచి తాడేపల్లిగూడెం వైపు వెళుతున్న లారీ హైవేపై అటుగా కాకినాడ నుంచి మచిలీపట్నం వెళుతున్న కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ఒక్కసారిగా అదుపు తప్పి ఆనందరాజు స్కూటర్‌ను ఢీకొట్టింది. దీంతో స్కూటర్‌ అదుపుతప్పి రోడ్డుపైనే ఉన్న కల్వర్టును ఢీకొట్టడంతో వాహనంపై ప్రయాణిస్తున్న వెంకటసాయి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. తల్లిదండ్రులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఇదే ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సువర్ణబిందు దంపతులకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీను ఆపేందుకు స్థానికులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పోలీసులకు సమాచారం అందించడంతో వాహనం గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

మరిన్ని వార్తలు