బాలుడిని కబళించిన మృత్యుతీగ

22 Nov, 2019 11:12 IST|Sakshi
జయరాజ్‌ మృతదేహం వద్ద రోదిస్తున్నకుటుంబ సభ్యులు, జయరాజ్‌ (ఫైల్‌) 

సాక్షి, విజయనగరం(పూసపాటిరేగ): చేసేది చిన్నపాటి ఉద్యోగమైనా... కన్నకొడుకును చక్కగా చదివించుకోవాలన్నది వారి ఆరాటం. ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నది వారి కోరిక. అందుకే అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. గుట్టుగా కాపురం చేసుకుంటున్నారు. కానీ విధి వారి ఆశలను అడియాసలు చేసింది. వారి కలలు కల్లలు చేసింది. విద్యుత్‌తీగ రూపంలో మృత్యువు వారి బిడ్డను చిదిమేసింది. హృదయ విదారకమైన ఈ సంఘటన పూసపాటిరేగ మండలం పేరాపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పైడిరాజు గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో బస్‌డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య వెంకటలక్ష్మి గృహిణి. వారికి ఇద్దరు సంతానం. పెద్దవాడు జయరాజ్‌(9) తండ్రి పనిచేస్తున్న పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నాడు. కుమార్తె విజయరత్న మూడో తరగతి చదువుతోంది.

గురువారం ఉదయం ఎప్పటి మాదిరిగా ఉదయం లేచిన జయరాజ్‌ కాలకృత్యాలు తీర్చుకునేందుకు గ్రామసమీపంలోని చాకలి కోనేరు వద్దకు వెళ్లాడు. కానీ దురదృష్టవశాత్తూ అక్కడ పడి ఉన్న హెచ్‌టీ విద్యుత్‌తీగను చూసుకోకపోవడంతో అదికాస్తా కాలికి తగిలి బాలుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి గుండెలవిసేలా రోదించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ బాలాజీరావు అక్కడకు చేరుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు