శివశివా.. ఏమిటీ శిక్ష!

5 Mar, 2019 07:53 IST|Sakshi
కుమారుడి మృతదేహం పట్టుకుని రోదిస్తున్న తల్లి దేవి

శివాలయంలో పూజలు చేసుకుని వచ్చిన కుటుంబంలో విషాదం

ఆడుకుంటూ గుంటలో పడి బాలుడి మృతి

కన్నీరుమున్నీరుగా విలపించిన కుటుంబ సభ్యులు

తూర్పుగోదావరి,శివకోడు (రాజోలు): మహాశివరాత్రి పర్వదినం రోజున ఆ కుటుంబం అంతా శివాలయానికి వెళ్లి అభిషేకాలు చేయించుకుని వచ్చింది. అంతలోనే ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుట్టిన మగబిడ్డను అల్లారు ముద్దుగా పెరుగుతున్న గంధం కేశవ శివ షణ్ముఖ్‌ (4) ఇంటికి వెనుక ఆడుకుంటూ అక్కడ ఉన్న సిమెంట్‌ మురుగు గుంటలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. నర్సాపురానికి చెందిన బాలుడి తండ్రి బాలాజీ ఫ్లంబింగ్‌ పనుల కోసం శివకోడులో నారాయణ స్కూల్‌ సమీపంలో నివాసం ఉంటున్నాడు. పాఠశాలకు సెలవు కావడంతో భార్య, పిల్లలతో శివాలయానికి తీసుకువెళ్లి వారిని ఇంటిలోకి చేర్చి పని కోసం వెళ్లిపోయాడు. ఆ బాలుడు గుంటలో పడి కూరుకుపోయాడు.

సుమారు రెండు గంటల సేపు బాలుడు కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు స్థానికులను విచారించారు. గుంటల్లోంచి బుడగలు వస్తుంటే కంగారు పడ్డారు. స్థానికులు సర్వే బాదులతో గుంటలో వెతికారు. బాలుడు గుంటలో తేలడంతో హుటాహుటీన రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆమె తల్లి దేవి కన్నీరుమున్నీరుగా విలపించింది. ముక్కుపచ్చలారని బాలుడికి నూరేళ్లు నిండాయని కాలనీవాసులు విచారంలో మునిగిపోయారు. రెండు నెలల క్రితం మూత ఉన్న మురుగు గుంటను స్థల యజమాని తవ్వడంతో గుంటలోకి ఊట నీరు చేరి ఊబిగా మారిందని స్థానికులు తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న ఈ గుంటను మూసివేయాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. అధికారులు స్పందించి ఈ గుంటను పూడ్చి వేసి స్థల యజమానిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

మరిన్ని వార్తలు