పక్కా స్కెచ్‌ వేసిన ప్రియుడు

4 Feb, 2017 09:26 IST|Sakshi
పక్కా స్కెచ్‌ వేసిన ప్రియుడు

నెల్లూరు :
వారిద్దరి ఊర్లు వేరు..ఫేస్‌బుక్‌లో పరిచయం..అది కాస్తా ప్రేమగా మారింది. చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. చివరకు ప్రియుడు మొహం చాటేశాడు. దీంతో ప్రియురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రియుడిపై కేసు నమోదైంది. దీంతో కేసు నుంచి ఎలాగైనా బయటపడాలని పక్కా స్కెచ్‌ వేసి ప్రియురాలిని మళ్లీ మోసం చేశాడు. నమ్మించి కేసు కొట్టేయించుకొని ఇంటికొస్తే పెళ్లి గురించి మాట్లాడుకుందామని చెప్పాడు. చివరకు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ప్రియురాలిపై ప్రియుడి కుటుంబ సభ్యలందరూ కలిసి దాడికి దిగారు.  

ఈ సంఘటన భక్తవత్సలనగర్‌ లెప్రసీ హాస్పిటల్‌ సమీపంలో శుక్రవారం రాత్రి పొద్దుపోయాక చోటుచేసుకుంది. వివరాలు..విజయవాడ భవాననీపురానికి చెందిన కీర్తి డిగ్రీ చదువుతోంది. ఆమెకు సుమారు ఏడాదిన్నర క్రితం నెల్లూరు భక్తవత్సలనగర్‌కు చెందిన ఎ.వెంకటసాయితో ఫేస్‌బుక్‌లో పరిచయం అయింది. కొంతకాలం చాటింగ్‌ చేసుకొన్నారు. ఇద్దరు అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డారు.

పలుమార్లు వెంకటసాయి విజయవాడకు వెళ్లి ప్రియురాలిని కలిసివచ్చాడు. వారి ప్రేమ వ్యవహారం వెంకటసాయి కుటుంబసభ్యులకు తెలియడంతో వారు అతనిని కీర్తిని కలవ్వనివ్వకుండా అడ్డుకున్నారు. పలుమార్లు కీర్తి అతనికి ఫోను చేసింది. కులాలు వేరుకావడంతో ప్రేమను అంగీకరించడం లేదని ఇక కలవలేనని వెంకటసాయి ఆమెకు చెప్పాడు. దీంతో మనస్థాపం చెందిన కీర్తి గతేడాది జూన్‌ 10న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రియుడి మోసంపై అప్పట్లో విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంకటసాయి ప్రియురాలిని విడిచి ఉండలేనని ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా ఆమె కోసం విజయవాడకు వచ్చాడు.

నీవెంటే ఉంటానని ఆమెను నమ్మించాడు. ఖమ్మం జిల్లా మదిరలోని బంధువుల వద్ద ఉంటూ ఉద్యోగం చేస్తానని, తర్వాత వివాహం చేసుకుందామని చెప్పడంతో కీర్తీ అతనిని పూర్తిగా నమ్మింది. అతని అవసరాల కోసం తన బంగారు వస్తువులను అమ్మి రూ.20 వేలు నగదు కూడా ఇచ్చింది. ఆమెను శారీరకంగా అనుభవించాడు. ఆమెతో ప్రేమగా నటిస్తూ కేసు కొట్టివేయించుకున్నాడు. తాను అనుకున్న పని పూర్తవడంతో రాత్రికి రాత్రే నెల్లూరుకు ఉడాయించాడు. కీర్తి ఫోను చేస్తే మాట్లాడేవాడు కాదు. చివరకు కీర్తి రెండురోజుల క్రితం ఫోనులో గట్టిగా నిలదీసింది.

దీంతో నెల్లూరుకు వచ్చి తన కుటుంబసభ్యులను ఒప్పిస్తే వివాహం చేసుకొంటానని వెంకటసాయి చెప్పి ఫోను పెట్టేశాడు. అతని మాటలను గుడ్డిగా నమ్మిన కీర్తి తన కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం సాయంత్రం నెల్లూరుకు చేరుకుంది. వెంకటసాయి ఇంటికి వెళ్లి పెళ్లి విషయమై మాట్లాడే ప్రయత్నం చేయగా వెంకటసాయి అతని తల్లి, అక్క, బావలు కీర్తిని కులం పేరుతో దూషించి దాడి చేశారు. అడ్డుకున్న వారి కుటుంబసభ్యులపై సైతం దాడి చేశారు. తనను వివాహం చేసుకుంటేనే ఇంటి వద్ద నుంచి బయటకు వెళతానని కీర్తి కూర్చోవడంతో వెంకటసాయి కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసుకొని ఎటో వెళ్లిపోయారు. వెంకటసాయితో వివాహం అయ్యేంతవరకూ ఆందోళన కొనసాగిస్తానని ఇంటి ఎదుట బైఠాయించింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా