కుక్కల దాడిలో బాలుడు మృతి

17 Jun, 2018 04:04 IST|Sakshi

ఆరేళ్ల చిన్నారిని కొరికి చంపిన శునకాలు

సర్పవరం (కాకినాడ సిటీ): ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేసి దారుణంగా చంపేశాయి. ప్రహరీ దూకి వెళ్లి మరీ చిన్నారిపై దాడి చేశాయి. అందరూ ఇంటి లోపల ఉండడంతో ఆ బాలుడి ఆర్తనాదాలు ఎవరికీ వినబడలేదు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శనివారం ఈ దారుణం చోటుచేసుకుంది. కాకినాడ బాలా చెరువు సెంటర్‌లోని అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న దీపాలవారి వీధిలోని ఓ ఇంటిలో ఆరు కుటుంబాలు నివసిస్తున్నాయి.

ఆటోమెకానిక్‌గా పనిచేస్తున్న వాసంశెట్టి శ్రీనివాస్‌ కుటుంబంతో సహా ఇటీవలే ఆ ఇంటిలో అద్దెకు దిగాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. భార్య భూలక్ష్మి ఓ వృద్ధురాలి వద్ద ఆయాగా పనిచేస్తోంది. కుమారుడు నాగేంద్ర ఒకటో తరగతి చదువుతున్నాడు. శనివారం రంజాన్‌ పర్వదినం సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో చిన్నారులు ఇంటి వద్దే ఉన్నారు. తల్లిదండ్రులిద్దరూ రోజు మాదిరిగానే పనికి వెళ్లిపోయారు. అక్కలు ఇంటిలో ఉండగా, నాగేంద్ర ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో ఇంటి ప్రహరీ దూకి వీధికుక్కలు ఒక్కసారిగా నాగేంద్రపై దాడి చేసి ఈడ్చుకెళ్లాయి.

అందరూ లోపల ఉండిపోవడంతో అతడి ఆర్తనాదాలు ఏ ఒక్కరి చెవినా పడలేదు. కొద్దిసేపటికి చుట్టుపక్కల వారు గమనించి వారి బంధువులకు చెప్పారు. వారి వెళ్లి చూడగా అప్పటికే నాగేంద్ర మరణించాడు. అతడి తల వెనుక భాగాన్ని, భూజాన్ని కుక్కలు పీక్కు తిన్నాయి. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే ఇంటికి చేరుకున్నారు. కుమారుడి మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. 

మరిన్ని వార్తలు