వాట్సాపే అమ్మ..!

27 Feb, 2020 12:36 IST|Sakshi
తల్లి మల్లీశ్వరి చెంతకు చేరిన హర్షకుమార్‌

వాట్సాప్‌ సాయంతో తప్పిపోయిన బాలుడు తల్లి చెంతకు చేరిన వైనం

మెసేజ్‌ల ద్వారా విషయం చేరవేసిన పోలీసులు

ప్రకాశం, పొదిలి: ఆడుకుంటూ తప్పిపోయిన బాలుడుని పోలీసులు వాట్సాప్‌ ద్వారా సమాచారం అందించి తల్లికి అప్పగించిన ఘటన బుధవారం పట్టణంలో చోటు చేసుకుంది. కాకర్ల మల్లీశ్వరి, మాలకొండయ్య దంపతుల కుమారుడు హర్షకుమార్‌కు నాలుగు సంవత్సరాలు. వీరు ప్రకాశ్‌ నగర్‌లో ఉంటారు. బుధవారం తల్లి ఇంటి పనుల్లో ఉండగా, హర్షకుమార్‌ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆడుకుంటూ ఇల్లు మరచిపోయాడు. ఇస్లాంపేట, ప్రకాశ్‌నగర్‌ వీధుల్లో తిరుగుతుండగా బాలుడిని గమనించిన స్థానిక యువకులు పోలీస్‌స్టేషలో అప్పగించారు.

హర్షకుమార్‌ మాత్రం ఎలాంటి విచారం లేకుండా స్టేషన్‌లో టేబుల్‌పై నుంచొని ఫొటోలకు పోజులిచ్చాడు. మరో వైపు తల్లి మల్లీశ్వరికి తన కొడుకు కనిపించకపోవటంతో ఆందోళనతో వీధులన్నీ తిరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎస్సై సురేష్‌ బాలుడు ఫొటోలనే వాట్సాప్‌ ద్వారా మెసేజ్‌ చేయించారు. దానిని చూసిన స్థానిక యువకులు హర్షకుమార్‌ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మల్లీశ్వరి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లడంతో బాలుడిని ఆమెకు అప్పగించారు. దీంతో తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వాట్సాప్‌ మెసేజ్‌లను అందరికీ షేర్‌ చేసినవారిని ఎస్సై సురేష్‌ అభినందించారు.

మరిన్ని వార్తలు