ఎమ్మెల్యే అంకుల్‌! పింఛను ఇప్పించరూ..

20 Jun, 2019 10:10 IST|Sakshi

సాక్షి, ఐరాల(చిత్తూరు) : ఎమ్మెల్యే అంకుల్‌..మా నాన్నకు పింఛను ఇప్పించి ఆదుకోండి’ అని ఓ విద్యార్థి ఏమాత్రం జంకూగొంకూ లేకుండా ఎమ్మెల్యే కారు వద్దకు పరుగులు తీసి కోరడం పలువురినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. మండలంలోని ఎం.పైపల్లె హైస్కూలులో ఓ కార్యక్రమానికి హాజరైన అనంతరం ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు తన కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఇదే స్కూలులో ఎనిమిదవ తరగతి చదువుతున్న 8వ తరగతి విద్యార్థి ఎం.సందీప్‌ పరుగున ఎమ్మెల్యే కారు వద్దకు వెళ్లాడు.

తాను జంగాలపల్లె దళితవాడకు చెందిన మాజీ సర్పంచ్‌ కోదండయ్య కుమారుడని, కొంత కాలం క్రితం తన తల్లి చనిపోయిందని, వ్యవసాయ కూలీ అయిన తన తండ్రి తన కోసం ఎంతగానో కష్టపడుతున్నాడని చెప్పుకొచ్చాడు. తన తండ్రి కూలీ పనికి వెళ్లినప్పుడు కాలికి గాయమైందని, మధుమేహం మూలాన అది నయం కాక తీవ్రమైందని, చివరకు ఆయన ఎడమకాలును మోకాలు వరకు రుయా ఆస్పత్రిలో తొలగించారని కంటతడి పెట్టాడు. అప్పటి నుంచి కుటుంబ పోషణ కష్టమైందని, బంధువుల దయా దాక్షిణ్యాల మీద తామిద్దరూ ఆధారపడాల్సి వస్తోందని, తనవరకైతే మధ్యాహ్న భోజనం స్కూలులో తింటున్నానని, తన తండ్రి ఒక్కోసారి పస్తులు ఉండాల్సి వస్తోందని ఆవేదన చెందాడు.

తన తండ్రికి వికలాంగ పింఛను మంజూరు చేయిస్తే తమ జీవనానికి ఇబ్బందులు ఉండవని నివేదించాడు. దాదాపు 10 నిమిషాల పాటు విద్యార్థి గోడును సావధానంగా ఆలకించిన ఎమ్మెల్యే తండ్రీకొడుకుల దుస్థితిపై కదలిపోయారు. ఎమ్మెల్యే సూచన మేరకు విద్యార్థి అక్కడికక్కడే అర్జీ రాసిచ్చాడు. ఆ తర్వాత ఎంపీడీఓ జీవరత్నంను ఎమ్మెల్యే పిలిపించారు. విద్యార్థి అర్జీపై సంతకం చేసి,  పింఛను మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థి కళ్లల్లో కృతజ్ఞతతో కూడిన ఆనందం తొంగిచూసింది. 

మరిన్ని వార్తలు