పేదింటి బిడ్డకు కిడ్నీల సమస్య

23 Jul, 2018 13:31 IST|Sakshi
అమ్మమ్మ మస్తాన్‌బీతో బాలుడు సమీర్‌

వైద్యభారం భరించలేక తల్లి సతమతం

శస్త్రచికిత్సకు సహకరించని  వయస్సు

నెల్లూరు, కొడవలూరు: మండలంలోని గండవరం గాడికయ్యలులో నివాసముంటున్న పర్వీన్‌కు సమీర్‌(7) అనే కుమారుడు ఉన్నాడు. ఆ బాలుడికి మూడేళ్ల వయస్సులోనే రెండు కిడ్నీల్లో సమస్య తలెత్తింది. ఒక్కసారిగా బాలుడి ముఖం, కాళ్లు, చేతులు వాచిపోయి కడుపునొప్పని నేల కొరిగిపోయాడు. దీంతో పర్వీన్‌ కుమారుడిని నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చింది. అక్కడ వారం రోజుల పాటు చికిత్స చేయించగా ఆరోగ్యం కొంత మెరుగుపడింది. సమస్య పూర్తిగా నయం కాలేదు. శస్త్రచికిత్సకు బాలుడి వయస్సు సహకరించదని, వ్యాధి పూర్తిగా నయం కావాలంటే డబ్బు భారీగా ఖర్చవుతుందని వైద్యులు తేల్చేశారు. ఆ సమయానికి బాలుడి పరిస్థితి బాగానే ఉండటంతో ఇంటికి తీసుకొచ్చి, పాఠశాల్లో చేర్పించారు. ఏడాది తర్వాత పాఠశాలకు వెళ్లిన బాలుడు ఆ ఆవరణలోనే మరోసారి ముఖం, కాళ్లు, చేతులు వాచిపోయి కుప్పకూలిపోయాడు. వెంటనే బాలుడిని తిరుపతిలో వైద్యుల వద్ద చూపించారు.

వారు చిన్నారికి తప్పనిసరిగా మందులు వాడాలని తేల్చారు. అప్పటి నుంచి 6 నెలలకోమారు సమస్య పునరావృతమవుతూనే ఉంది. అలా జరిగినప్పుడల్లా చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లి వ్యాధిని నయం చేస్తున్నారు. అనారోగ్యం నేపథ్యంలో బాలుడిని పాఠశాలకు పంపడం కూడా మానేశారు. బాలుడికి తండ్రి ఉన్నప్పటికీ అతను ఇంటికి రావడం మానేయడంతో తల్లే పాచి పనులు చేసి చిన్నారిని కాపాడుకుంటోంది. పర్వీన్‌ పనులకు వెళ్లినప్పుడు బాలుడికి సాయంగా అమ్మమ్మ మస్తాన్‌బీ ఉంటోంది. చిన్నారికి చెన్నైలోని కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తే వ్యాధి నయమవుతుందని, అందుకు  రూ.2 లక్షలు ఖర్చవుతుందని కొందరు చెప్పినప్పటికీ అంత డబ్బు వెచ్చించలేక ఆ ప్రయత్నం చేయలేదని మస్తాన్‌బీ తెలిపింది. బాబుకు 18 ఏళ్లు వచ్చేదాక మందులు వాడితే ఆ తర్వాత నయమయ్యే అవకాశాలున్నాయని వైద్యులు చెప్పడంతో ఆ ఆశతోనే కష్టాలు పడి మందులు కొనుగోలు చేస్తున్నామని వాపోయారు. దాతలు సాయం చేస్తే తమ బిడ్డకు మెరుగైన వైద్యం అందిస్తామని పర్వీన్‌ కోరుతోంది. 

మరిన్ని వార్తలు