నాన్న ఉత్తరం చూశాక కన్నీళ్లు ఆగలేదు..

7 Jan, 2020 12:42 IST|Sakshi
జగదీష్‌ సాయిని తండ్రికి అప్పగిస్తున్న సీపీ ద్వారకా తిరుమలరావు

ప్రతిభావంతుడైన ఓ విద్యార్థి ఆవేదన

సాక్షి, అమరావతి బ్యూరో: కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఫీజుల కోసం ఒత్తిడిని భరించలేక పారిపోయి హైదరాబాద్‌లోని ఓ రిసార్టులో తలదాచుకున్న ప్రతిభావంతుడైన విద్యార్థిని విజయవాడ పోలీసులు కాపాడి సోమవారం తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. గత ఏడాది నవంబరు 27వ తేదీన కళాశాల నుంచి అదృశ్యమైన విద్యార్థి తన ఆవేదనను ‘సాక్షి’కి వివరించాడు.

‘నాపేరు మాతూరి జగదీష్‌ సాయి. మాది ప్రకాశం జిల్లా మార్టూరు మండలం. నాన్న నాయీబ్రాహ్మణ వృత్తిలో ఉన్నారు. నాకు పదో తరగతిలో 9.3 గ్రేడ్‌ వచ్చింది. నన్ను బాగా చదివించాలనే తపనతో విజయవాడ నిడమానూరులోని చైతన్య కళాశాలలో ఎంపీసీ గ్రూపులో చేర్పించారు. కానీ ఇక్కడి పరిస్థితులు, అధ్యాపకుల తీరు, ఫీజుల కోసం పదేపదే గుర్తు చేసే యాజమాన్యం తీరుతో నవంబర్‌ 27 తెల్లవారుజామున కళాశాల నుంచి వెళ్లిపోయి హైదరాబాద్‌ చేరుకుని ఓ రిసార్టులో క్యాటరింగ్‌ పనిలో చేరా. కొద్ది రోజుల తరువాత తల్లిదండ్రులు గుర్తొచ్చారు. కానీ వారికి ముఖం ఎలా చూపించాలో అర్థం కాలేదు. నాకు బావ వరుస అయ్యే సాయితేజ్‌ని  డిసెంబరు 14న నా స్నేహితుడి ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా పలకరించా. అందులో మా నాన్న రాసిన ఉత్తరం చూశాక కన్నీళ్లు ఆగలేదు. నేను క్షేమంగానే ఉన్నా, నాకోసం వెతకొద్దని మెసేజ్‌ పెట్టా. తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఆదివారం పోలీసులతో కలసి నా వద్దకు వచ్చిన నాన్నను చూడగానే ఏడుపు ఆగలేదు. క్షమించమని కోరా. ఆయన అక్కున చేర్చుకుని ఓదార్చడం చూశాక ఇక ఎప్పుడూ ఇలాంటి పని చేయకూడదని నిర్ణయించుకున్నా’ అని జగదీష్‌ తెలిపాడు.

విద్యార్థి అదృశ్యంపై నవంబరు 28న ఫిర్యాదు అందుకున్న విజయవాడ పటమట పోలీసులు పలు మార్గాలో కేసు దర్యాప్తు జరిపారు. ఫేస్‌బుక్‌ ఖాతాను విశ్లేషించి విద్యార్థి జాడను గుర్తించారు. నగర పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు సమక్షంలో విద్యార్థిని తల్లిదండ్రులకు అప్పగించారు.

బాగా చదువుకోవాలనుకున్నా. కానీ కళాశాల పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఫీజు కట్టాలని పదేపదే ఒత్తిడి చేయడంతో మనస్తాపంతో కాలేజీ నుంచి పారిపోయా
 – జగదీష్‌ సాయి 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా