ఇదెక్కడి న్యాయం?

7 Aug, 2015 03:02 IST|Sakshi

వసతులు,  జీతాలు అడిగితే జాబ్‌చార్ట్ పేరుతో బెదిరింపులు
సమావేశాన్ని బహిష్కరించిన ఐఈఆర్టీలు

 అనంతపురం ఎడ్యుకేషన్ : ‘ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలను  శుభ్రం చేసేవారు లేరు. జూన్ నుంచి మరుగుదొడ్లను పట్టించుకోకపోవడంతో కంపు కొడుతున్నాయి. ఈ విషయాలన్నీ అధికారులకు తెలుసు. అయినా ఇవేవి పట్టించుకోకుండా జాబ్‌చార్ట్ పేరుతో బెదిరింపులకు గురిచేయడం ఎంతవరకు న్యాయం’ అని ఇన్‌క్లూజివ్  ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్లు (ఐఈఆర్టీ) వాపోయారు.  గురువా రం ఉదయం స్థానిక సైన్స్ సెంటర్‌లో ఐడీ కోఆర్డినేటర్ పాండురంగ ఐఈఆర్టీలతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ...‘మీరు తలవంపులు తెస్తున్నారు. ప్రతి భవిత కేంద్రంలోనూ 20 మంది ప్రత్యేక పిల్లలు ఉండాలని చెబుతున్నాం.

9 నుంచి మధ్యాహ్నం 3.30 గం టల వరకు పిల్లలందరూ కేంద్రాల్లో ఉం డాలని చెప్పాం. ఇలా ఏకేంద్రమూ నడవడం లేదు. మీరంతా కాంట్రాక్ట్ ఉద్యోగులు. అందరికీ మెమోలు ఇచ్చి ఇంటికి  పంపుతామం’టూ హెచ్చరించారు. దీం తో మనస్తాపానికి గురైన ఐఈఆర్టీలు సమావేశాన్ని బహిష్కరించారు. అందరూ బయట చెట్లకింద బైఠాయించారు. పీఓ వచ్చి మాట్లాడేంతవరకు సమావేశానికి హాజరుకామని తెగేసి చెప్పారు. వారు మాట్లాడుతూ రాష్ట్రమంతా అన్ని జిల్లాల ఐఈఆర్టీలకు జీతాలు క్రమం తప్పకుండా పడుతున్నాయన్నారు. ఇక్కడ మాత్రం రెన్నెల్లుగా జీతాలు ఇవ్వలేదన్నారు.

ప్రత్యేక అవసరాల పిల్లలను తీసుకురావాలంటే ఎదురవుతున్న ఇబ్బందులను వివరిస్తున్నా వినకుండా చిందులేయడం ఏం న్యాయమని వాపోయారు. ఐఆర్టీలను అధికారులు తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారని వాపోయారు. మహిళా ఉద్యోగులు ఎలా పని చేయాలన్నారు.    సుమారు రెండు గంటల అనంతరం సమాచారం అందుకున్న పీఓ జయకుమార్ వచ్చి ఈఆర్టీలతో మాట్లాడారు.  వసతుల లేమిపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. సమావేశంలో ఐడీ కోఆర్డినేటర్ పాండురంగ, అసిస్టెంట్ జీసీడీఓ జయశేఖర్‌రెడ్డి. అసిస్టెంట్ ఐడీ కోర్డినేటర్ వెంకటలక్ష్మీ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు