న్యాయం కోసం యువతి మౌనదీక్ష

20 Aug, 2018 11:21 IST|Sakshi
ప్రియుడి ఇంటి ఎదుట దీక్ష చేస్తున్న యువతి

ముండ్లమూరు (ప్రకాశం): ప్రేమ పేరుతో తనని మోసం చేసి మరో యువతిని రిజిస్టర్‌ వివాహం చేసుకున్న యువకుడి ఇంటి ఎదుట ఓ యువతి మౌనదీక్ష చేస్తోంది. బాధితురాలి కథనం ప్రకారం.. మండలంలోని కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన గుర్రం వెంకటేశ్వర్లు బీటెక్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆ క్రమంలో వెంకటేశ్వర్లుకు విజయనగరం జిల్లా మొరకముడి మండలం యాడిక గ్రామానికి చెందిన బొత్స దేవీకుమారితో పరిచయమైంది. కొంతకాలం స్నేహంగా ఉన్నారు. ఆ తర్వాత ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని ఆ తర్వాత మోహం చాటేయడంతో బాధితురాలు శనివారం రాత్రి కమ్మవారిపాలెం వచ్చి వెంకటేశ్వర్లును నిలదీసింది.

నీతో స్నేహం మాత్రమే చేశానని, తనకి మరో యువతితో రిజిష్టర్‌ వివాహం జరిగిందని అతడు బదులిచ్చాడు. ఆందోళన చెందిన యువతి తనని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి గుట్టు చప్పుడు కాకుండా వేరే యువతిని పెళ్లి చేసుకున్నానని చెప్పడం ఏంటని అతడి ఇంటి ఎదుట దీక్షకు దిగింది. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ శివనాంచారయ్య తన సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకొని బాధిత యువతిని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వెంకటేశ్వర్లు ప్రేమ పేరుతో మోసం చేసినట్లు ఏమైనా ఆధారాలు ఉంటే చూపితే కేసు నమోదు చేసి న్యాయం చేస్తామని ఎస్‌ఐ ఆమకు హామీ ఇచ్చారు. అందుకు ఆ యువతి మౌనంగా ఉంది. ప్రియుడి ఇంటి ముందు దీక్ష కొనసాగిస్తోంది. పోలీసులు ఉమన్‌ వెల్ఫేర్‌ సొసైటీకి సమాచారం అందించారు. వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు ఆమెకు రక్షణ కల్పించారు. ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ ఇందిరమ్మ వచ్చి బాధిత యువతికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

మరిన్ని వార్తలు