బీపీఎల్ కథ కంచికే..!

23 Nov, 2013 03:30 IST|Sakshi
  • 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు పీపీఏ రద్దుకు ప్రభుత్వ నిర్ణయం
  •   భూమి వెనక్కి తీసుకోవాలని డిస్కంలకు ఆదేశం.. త్వరలో ఉత్తర్వులు
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీపీఎల్ కంపెనీ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కథ కంచికి చేరింది. బీపీఎల్‌తో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని(పీపీఏ) రద్దు చేసుకునేందుకు వి ద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సిద్ధమయ్యా యి. కంపెనీకి కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. కరీంనగర్ జిల్లాలోని రామగుండం వద్ద 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు బీపీఎల్‌తో డిస్కంలు 2009లో పీపీఏ కుదుర్చుకున్నాయి. 
 
 ఆ మేరకు 2013 సెప్టెంబర్ 20కి ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక వనరులను (ఫైనాన్షియల్ క్లోజర్) కంపెనీ సమకూర్చుకోవాలి. కానీ ఇప్పటివరకు కంపెనీ ఈ ప్రక్రియ పూర్తిచేయలేదు. దీంతో బీపీఎల్‌కు సెప్టెంబర్ 21న డిస్కంలు షోకాజ్ నోటీసులిచ్చాయి. 15 రోజు ల్లోగా జవాబివ్వాలని ఆదేశించాయి. తమకు మరికొంత గడువివ్వాలని బీపీఎల్ కోరినట్టు తెలిసింది. నిరాకరించిన డిస్కంలు... పీపీఏ రద్దు కు ప్రభుత్వాన్ని అనుమతి కోరాయి. ఇందుకు అంగీకరిస్తూ సీఎం సంబంధిత ఫైలుపై సంతకం చేసినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 
 
 ఆది నుంచీ అంతే: 1990వ దశకంలో ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్టు కింద 520 మెగావాట్ల సామర్థ్యంతో రామగుండం వద్ద విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను బీపీఎల్ చేజిక్కించుకుంది. ఈ ప్లాంటుకు అవసరమైన భూమి, నీరు, బొగ్గు సరఫరాను అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు (ఏపీఎస్‌ఈబీ) సమకూర్చింది. తర్వాతి కాలంలో ప్రాజెక్టు నిర్మాణాన్ని బీపీఎల్ చేపట్టలేదు. 2004లో ఈ ప్రాజెక్టుతో కుదుర్చుకున్న పీపీఏని ప్రభుత్వం రద్దు చేసింది. అయితే కంపెనీ మళ్లీ ముందుకొచ్చి 520 మెగావాట్లకు బదులుగా 600 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తామని... ఇందుకు మెగావాట్‌కు రూ.5.1 కోట్ల మేరకు ఖర్చు అవుతుందని 2009లో ప్రభుత్వానికి తెలిపింది. 
 
 అయితే మెగావాట్‌కు రూ. 4.76 కోట్ల పెట్టుబడి వ్యయంతో 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంటుకు మంత్రివర్గ ఉపసంఘం పచ్చజెండా ఊపింది. ఇందుకు అనుగుణంగా 2009 అక్టోబర్ 9వ తేదీన ఇంధనశాఖ ఉత్తర్వులు జారీచేసింది. అదే విధంగా సవరించిన పీపీఏను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి కంపెనీ సమర్పించింది. ఈ మేరకు గత సెప్టెంబర్ 20వ తేదీ నాటికి ఫైనాన్షియల్ క్లోజర్‌కు ఈఆర్‌సీ ఆదేశించింది. ఈఆర్‌సీ ఆదేశాల నేపథ్యంలో విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన రుణ సమీకరణను కంపెనీ సెప్టెంబర్ 20 నాటికి చేపట్టాలన్నమాట. అయితే కంపెనీ ఎలాంటి పురోగతి చూపకపోగా మరింత సమయం కావాలని కోరుతోంది. 
 
 ప్రధాని అయినా కాదేమో: బీపీఎల్ ఫైలును చూసినప్పుడు అధికారులతో సీఎం సరదాగా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ‘నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు కంపెనీ ముందుకు వచ్చింది. నేను సీఎం అయినా ప్లాంటు కట్టలేదు. రేపు నేను ప్రధాని అయినా ఈ ప్లాంటు రాదేమో’నని వ్యాఖ్యానించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 
మరిన్ని వార్తలు