ప్రకృతి పాలెగాడు ఈ ఆర్గానిక్‌ బ్రహ్మయ్య

26 Aug, 2019 10:40 IST|Sakshi

70 ఏళ్ల వయస్సులో వికలత్వాన్ని అధిగమించి పెరటి సేద్యం 

అతని ఆశయానికి సహకరించిన స్నేహితులు

15 డ్రమ్ముల్లో కూరగాయ పంటల సాగు

సాక్షి, ఒంగోలు : కృషితో నాస్తి దుర్భిక్షం.. ఆలోచించాలే గాని ఆచరణకు వంద మార్గాలుంటాయి. సేంద్రియ వ్యవసాయం చేయాలన్న ఆశ ఆ రైతులో బలంగా నాటుకుంది. శరీరానికే వికలత్వం మనస్సుకు కాదని నిరూపించాడు సేంద్రియ రైతు బ్రహ్మయ్య. వికలత్వం, వృద్ధాప్యం కూడా అతని సంకల్పం ముందు పటాపంచలయ్యాయి.  మంగమూరు గ్రామంలో జన్మించిన బ్రహ్మయ్య పెళ్లైన తర్వాత నుంచి ఒంగోలులోని ఆర్టీసీ–2 కాలనీలోనే నివసిస్తున్నాడు.  బ్రహ్మయ్యకు ఒక కాలు సరిగా లేదు. సొంతూర్లో పొలం ఉన్నా సేద్యం చేయడానికి  తన వికలత్వం అడ్డొచ్చింది. కానీ సేద్యం చేయాలన్న బలమైన సంకల్పం అతనిలోనే ఉండిపోయింది. ఆ సంకల్పానికి తన స్నేహితులు చేయూతనందించారు. ప్రకృతి వ్యవసాయంపై విజయవాడలో జరిగే అవగాహన సదస్సు నుంచి బ్రహ్మయ్యకు కొన్ని పుస్తకాలు తెచ్చిచ్చేవారు. వాటితో పాటు టీవీల్లో ప్రసారమయ్యే వ్యవసాయ కార్యక్రమాలు చూసి పెరటి వ్యవసాయం ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాడు. ఏడు పదుల వయస్సులో నాకెందుకు అనుకోకుండా నేను కూడా ఏదో ఒకటి చేయాలన్న సంకల్పమే అతని విజయానికి కారణం. 

డ్రమ్ముల్లోనే సేద్యం
పుస్తకాలు, టీవీ ప్రసారాలు చూసి ప్రకృతి వ్యవసాయం చేయాలనుకున్న బ్రహ్మయ్యకు స్థలం పెద్ద సమస్యగా మారింది. ఇంటి పెరడు వేద్దామంటే అంత జాగా కూడా లేదని బాధపడ్డాడు. ఆ బాధలో నుంచే అతనికో ఆలోచన పుట్టింది. అదే డ్రమ్ముల్లో సేద్యం. మనం నీళ్లు పట్టుకునేందుకు ఉపయోగించే డ్రమ్ముల నిండా మట్టి నింపి సాగు చేస్తున్నాడు. ఒక్కో డ్రమ్ముకు 23 రంధ్రాలు చేసి.. చిన్న చిన్న పైపులు ఏర్పాటు చేసి వాటిల్లో కూరగాయ విత్తనాలు సాగు చేసేవాడు. ఇలా 15 డ్రమ్ముల్లో పెరటి సేద్యం చేస్తున్నాడు. వీటిల్లో పెరిగిన కూరగాయలను చుట్టుపక్కల వారికి విక్రయిస్తున్నాడు. 

రాలిన ఆకులే ఎరువు..
పెరటి సేద్యానికి ఎరువులు కూడా బ్రహ్మయ్యే తయారు చేసుకునే వాడు. మొక్కలను చీడపీడల నుంచి కాపాడేందుకు ఆవుమూత్రం, వేప కషాయంతో ఓ రసాయనాన్ని తయారు చేసుకుని మొక్కలపై స్ప్రే చేసేవాడు. మొక్కల నుంచి రాలిన ఆకులన్నీ పోగు చేసి ఆవు పేడ కలిపి ఓ ఎరువుగా తయారు చేసుకునేవాడు. ప్రస్తుతానికి 15 డ్రమ్ముల్లో పెరటి పంట సాగు చేస్తున్న బ్రహ్మయ్య వాటిని 50 డ్రమ్ముల వరుకు సాగు చేసేందుకు కృషి చేస్తున్నాడు. వికలత్వం, వృద్ధాప్యాన్ని అధిగమించి ఆరోగ్యం కోసం పెరటి సాగు చేస్తున్న బ్రహ్మయ్యను ఆదర్శంగా తీసుకోవాలి.   

మరిన్ని వార్తలు