బ్రాహ్మణుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం

22 May, 2018 01:22 IST|Sakshi

బ్రాహ్మణ ఐక్య వేదిక ధ్వజం

సాక్షి, అమరావతి: బ్రాహ్మణుల్లో ఐక్యతను దెబ్బతీసి వారి మధ్య చిచ్చు పెట్టడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని బ్రాహ్మణ ఐక్య వేదిక తీవ్రంగా తప్పుపట్టింది. తిరుమల ఆలయంలో జరిగే అపచారాలతో పాటు స్వామి వారి ఆభరణాల భద్రతపై సూటిగా ప్రశ్నించిన రమణదీక్షితులును ఆలయ ప్రధాన అర్చక బాధ్యతల నుంచి తప్పించడా న్ని తప్పుపడుతూ బ్రాహ్మణ ఐక్యవేదిక సోమవారం విజయవాడలో సమావేశం నిర్వహించింది.

వంశపారంపర్య అర్చకుల సర్వీసు రూల్స్‌ అంశంలో ఏపీ సర్కారును ప్రశ్నించిన ఐవైఆర్‌ కృష్ణారావుపై ఆ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కొందరు బ్రాహ్మణులను ఉసిగొలిపి అప్పట్లో సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారన్నారు. తాజాగా రమణ దీక్షితులు అంశంలోనూ అదే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పెద్దల సూచనలతో బ్రాహ్మణులను తిడుతున్న వారికైనా ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగితే సంతోషమన్నారు.

కరడుగట్టిన కులస్వామ్య పార్టీలో అలాంటిది సాధ్యం కాదని తాము అభిప్రాయపడుతున్నామన్నారు. రమణదీక్షితులును టీటీడీ ప్రధాన అర్చక బాధ్యతల నుంచి తొలగించడం ఏపీ ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు చర్యగా గన్నవరం భువనేశ్వరి పీఠాధిపతి సత్యానంద భారతీ స్వామి అభిప్రాయపడ్డారు. రమణదీక్షితులు తిరిగి ఆ బాధ్యతల్లో నియమితులయ్యే వరకు ఐక్యంగా పోరాడదామని ఆయన పిలుపునిచ్చారు.

టీటీడీ ప్రధాన అర్చక బాధ్యతల నుంచి రమణదీక్షితులు తొలగింపు భవిష్యత్‌లో చిన్న ఆలయాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని ఐవైఆర్‌ కృష్ణారావు ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీలోనే వంశపారం పర్య అర్చకులను తొలగించిన ప్రభుత్వం చిన్న ఆలయాల్లో తొలగించదా అని ప్రశ్నించారు. రమణ దీక్షితులు చేసిన ఆరోపణలకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు సూటిగా జవాబు చెప్పిన వారు లేరని.. ఆయా అంశా లపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు