ఇల కైలాసం.. భక్తి పారవశ్యం

26 Feb, 2019 05:58 IST|Sakshi

శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం   

నేటినుంచి వాహన సేవలకు శ్రీకారం

భక్తుల కోసం అన్ని వసతులు సిద్ధం

మల్లన్న దర్శనానికి  తరలనున్న సిటీజనులు

సాక్షి, సిటీబ్యూరో :ఇల కైలాసంగా అభివర్ణించే శ్రీశైల దివ్య క్షేత్రంలో మహాశివరాత్రిబ్రహ్మోత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మార్చి 7 వరకు కొనసాగనున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రోజువారీ క్రతువులు, స్వామీ అమ్మవార్లకు నిత్యం వాహన సేవ, గ్రామోత్సవం కన్నులపండువగానిర్వహించనున్నారు. వాహన సేవలోపాల్గొనేందుకు గ్రేటర్‌ వాసులు ప్రత్యేక వాహనాల్లోనూ, కాలినడకనతరలివెళ్తుంటారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులుతలెత్తకుండా అన్ని వసతులుకల్పించారు.

ఇవీ వసతులు..
భక్తులు సేదతీరేందుకు వనాలు, పార్కులు, ఖాళీ స్థలాల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు
లడ్డూ ప్రసాదాల విక్రయశాలల వద్ద క్యూలైన్, చలువ పందిళ్లు వేశారు
శివ దీక్షా శిబిరాల వద్ద భక్తులకు చలువ పందిళ్లు, స్నానాలకు వాటర్‌ ట్యాప్‌లు, టాయిలెట్స్‌ ఏర్పాటు చేశారు
ఆలయ క్యూలైన్లలో, క్యూ కంపార్ట్‌మెంట్లలో భక్తులకు ఉచితంగా పాలు, నీళ్లు, అల్పాహారం, మజ్జిగ అందిస్తారు
పాతాళ గంగ వద్ద భక్తులకు తాగునీరు, షవర్‌బాత్‌లు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకొనేందుకు గదులు ఏర్పాటు చేశారు.

వాహన సేవలిలా..  
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 26 నుంచి స్వామి అమ్మవార్లకు వాహనసేవలు నిర్వహిస్తారు.
26న భృంగీ వాహనసేవ, 27న హంస వాహనసేవ, 28న మయూర వాహనసేవ, మార్చి 1న రావణ వాహనసేవ, 2న పుష్పపల్లకీ సేవ, 3న గజవాహన సేవ, 4న నందివాహన సేవ, 5న రథోత్సవం, 6న తెప్పోత్సవం, 7న అశ్వవాహన సేవలు ఉంటాయి.

ఆర్జిత సేవల నిలిపివేత..  
శ్రీశైల క్షేత్రంలోని ఉభయ దేవాలయాల్లో అన్ని ఆర్జిత సేవలను నిలిపివేశారు. బ్రహ్మోత్సవాలు పూర్తయ్యేంత వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవు.  

పాదయాత్రికులకు సూచనలు
భాగ్య నగరం నుంచి శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్లే భక్తులు విధిగా కొన్ని నియమాలు పాటించాలి. మార్గంలో అక్కడక్కడా శిబిరాలను ఏర్పాటు చేసి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బీడీలు, సిగరెట్లు, గుట్కాలు, అగ్గిపెట్టెలు ఉంటే స్వాధీనం చేసుకుంటారు. ప్లాస్టిక్‌ కవర్లలో ఆహార పదార్థాలు తీసుకెళ్లవద్దు  
కాలినడకన వెళ్లే భక్తులు అడవుల్లోని కుంటల్లో నీరు తాగకుండా వెంట శుద్ధ జలాలు తీసుకెళ్లడం మంచిది.   
నల్లమలలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వృద్ధులు, చిన్నారులు, వ్యాధిగ్రస్థుల శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు శుద్ధ జలాలను అందుబాటులో ఉంచుకోవాలి. ఒకవేళ ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో లేకుంటే చక్కెర, ఉప్పు నీటిలో కలిపి సేవించినా సరిపోతుంది.

మరిన్ని వార్తలు