మరణం లేని మారాజు

20 Apr, 2018 09:38 IST|Sakshi
బోర కనకరాజు, అనురాధ దంపతులు

బ్రెయిన్‌డెడ్‌ వ్యక్తి అవయవాలు దానం

ఆరిలోవ/తగరపువలస : మంచి మనసున్న వారు భౌతికంగా దూరమైనా వారి జ్ఞాపకాలు ఈ భూమిపై పదిలంగానే ఉంటాయి. మరణం లేని మారాజులా వెలుగొందుతూనే ఉంటారు. ఆ కోవకే చెందుతారు బోర కనకరాజు. తను చనిపోతూ మరో ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. విషాదకరమైనప్పటికీ స్ఫూర్తి రగిలించే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమిలి మండలం తాటితూరు పంచాయతీ బీసీ కాలనీకి చెందిన బోర కనకరాజు(31) మూడేళ్లు దుబాయ్‌లో వెల్డర్‌గా పనిచేశారు.  అనంతరం మూడేళ్ల క్రితం స్వస్థలం వచ్చి వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడ్డారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 14న నగరంలోని ఆరిలోవ ప్రాంతంలో బహుళ అంతస్థుల భవనంలో పనిచేస్తుండగా కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో తోటి కార్మికులు పినాకిల్‌ ఆస్పత్రిలో చేర్చగా అయిదు రోజుల పాటు చికిత్స పొందిన కనకరాజు బుధవారం బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యారు. దీంతో అతని అవయవాలను జీవన్‌ధార ఫౌండేషన్‌ ద్వారా ఇతరులకు అమర్చేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. కిడ్నీలలో ఒకటి కేర్‌ ఆస్పత్రికి, మరొకటి పినాకిల్‌ ఆస్పత్రికి, కాలేయం అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన కళ్లు, ఊపిరితిత్తులు, గుండె పాడవడంతో ఇతరులకు పనికిరాకుండా పోయాయి.  

తాటితూరులో విషాదం 
కనకరాజు మృతిలో స్వగ్రామం తాటితూరులో విషాదం నెలకొంది. కనకరాజు అవయవాలు వేరొకరికి మార్చే ప్రక్రియలో భాగంగా అతని శరీరం నుంచి తీసివేసిన తరువాత భౌతికకాయాన్ని స్వగ్రామమైన తాటితూరు తరలించాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఆస్పత్రిలోనే ఉంచారు. ఇంటి పక్కనే ఉన్న బంధువుల ఇంట గురువారం వివాహం జరుగుతుండడంతో ఆ వివాహాన్ని ఆపలేక... మృతదేహాన్ని తరలించలేక శుక్రవారం వరకు వాయిదా వేసుకున్నారు. మరోవైపు గ్రామంలో గ్రామదేవతల పండుగలు కూడా జరుగుతుండడంతో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మృతునికి భార్య అనురాధ, ఏడాదిన్నర కుమారుడు వంశీ, తల్లిదండ్రులు మంగరాజు, కొండమ్మ, అక్క, తమ్ముడు ఉన్నారు. 

మరిన్ని వార్తలు