అవయవదానంతో ఐదుగురికి జీవితం

21 Nov, 2017 10:32 IST|Sakshi
దుర్గారావు(ఫైల్‌) ,బిడ్డతో దుర్గారావు భార్య రాధా

గుంటూరు మెడికల్‌:తాను చనిపోతూ తన అవయవదానం ద్వారా ఐదుగురికి నూతన జీవితాన్ని దుర్గారావు ప్రసాదించారు. గుంటూరు రమేష్‌ హాస్పిటల్‌లో జీవన్‌ధాన్‌ పథకం ద్వారా అవయవాలను సేకరించి చికిత్స కోసం ఎదురు చూస్తున్నవారికి అందజేశారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట శృంగావరప్పాడు గ్రామానికి చెందిన బలే దుర్గారావు (22) కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 8న ఇంటి వద్ద మెట్లపై జారిపడి తలకు గాయమైంది.కుటుంబ సభ్యులు అతడిని చికిత్స కోసం భీమవరం, ఏలూరు ఆశ్రమ ఆస్పత్రి, విజయవాడ ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం అందించి, ఈనెల 18న గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు.

దుర్గారావును పరీక్షించిన వైద్యులు బ్రెయిన్‌ డెత్‌గా నిర్ధారించి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు. రమేష్‌ హాస్పిటల్‌ వైద్యులు జీవన్‌ ధాన్‌ పథకం ద్వారా దుర్గారావు అవయవాలను సేకరించి ఆస్పత్రుల్లో ఆపరేషన్‌ల కోసం ఎదురు చూస్తున్న బాధితులకు తరలించారు.  లివర్‌ను విజయవాడ మణిపాల్‌ హాస్పిటల్‌కు, ఒక కిడ్నిని గుంటూరు వేదాంత హాస్పిటల్‌కు, మరో కిడ్నిని శ్రీలక్ష్మి సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌కు, కళ్లను గుంటూరులోని సుదర్శిని హాస్పిటల్‌కు పంపారు. దుర్గారావుకు నాలుగేళ్ల కిందట రాధతో వివాహమైంది. మూడేళ్ల అఖిల, ఏడాది వయస్సు ఉన్న హాసిని ఉన్నారు.  ఆపరేషన్‌ ప్రక్రియలో డాక్టర్‌ శైలజ, డాక్టర్‌ కార్తీక్, డాక్టర్‌ ప్రకాశం పాల్గొన్నారు. ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆపరేషన్‌ ప్రక్రియ జరిగినట్లు రమేష్‌ హాస్పిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పోతినేని రమేష్‌బాబు తెలిపారు.

మరిన్ని వార్తలు