'ప్రధాన కుట్రదారుని పేరులేదు'

25 Sep, 2014 19:45 IST|Sakshi
తమ్మినేని సీతారామ్

హైదరాబాద్: అలిపిరి ఘటన కేసులో ప్రధాన కుట్రదారుడు గంగిరెడ్డి అని, ఈ రోజు కోర్టు తీర్పులో అతని పేరు లేదని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారామ్ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలకు కోర్టులు బ్రేకులు వేస్తున్నాయని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు.  ప్రభుత్వ నిర్ణయాలకు కోర్టులలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో నియమించిన కమిటీలను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని కోర్టు నిలువరించిందన్నారు. సొంతవారికి పట్టం కట్టి, అందరినీ అందలం ఎక్కించాలన్న బాబు నిర్ణయానికి కోర్టు బ్రేకు వేసిందన్నారు.

 ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని తప్పుపట్టారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రభాకర రెడ్డి తండ్రి ఒక్క రూపాయి అయినా పెన్షన్ తీసుకున్నారా? ఈ అంశాన్ని పరకాల రుజువు చేయగలరా? అని ఆయన ప్రశ్నించారు. టిడిపి హయాంలో పరకాలపై కిడ్నాప్ కేసు నమోదు కావడం వాస్తవం కాదా? అని అడిగారు. ఆ ప్రభుత్వానికే ఆయన సలహాదారుడా అని తమ్మినేని విస్మయం వ్యక్తం చేశారు. సామాజిక పెన్షన్లు మానివేసి, రాజకీయ పెన్షన్లు ఇవ్వడమే మీ ఉద్దేశమా? అని చంద్రబాబుని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో యధేచ్ఛగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోరు? అని ప్రశ్నించారు.
**

మరిన్ని వార్తలు