నమ్మక ద్రోహం

25 Dec, 2014 02:40 IST|Sakshi

అనంతపురం క్రైం : బంధువుల కంటే స్నేహితులే మిన్న అంటారు పెద్దలు. ఆపదలో ఆదుకున్న అటువంటి స్నేహితులకే కుచ్చుటోపి పెట్టాడు మన టీడీపీ మాజీ కార్పొరేటర్ కృష్ణమోహన్. స్థానికులు, బాధితుల కథనం మేరకు... నగరంలోని రంగస్వామినగర్‌కు చెందిన బి.కృష్ణమోహన్ టీడీపీ నేత. గత కౌన్సెల్‌లో కార్పొరేటర్‌గా పని చేశాడు. చీటీలు, వడ్డీ వ్యాపారం చేస్తుండేవారు. ఈ క్రమంలో స్నేహం ముసుగులో నమ్మినవారి వద్ద అప్పులు చేశాడు. కూతురు వివాహం కోసమని అడిగితే తమ వద్దలేకపోయినా తెలిసిన వారి వద్ద లక్షలాది రూపాయలు తెచ్చి ఇచ్చారు స్నేహితులు. మరికొంతమంది ప్రైవేటుగా పని చేసుకుంటూ లక్షలాది రూపాయలు చీటీలు పాడి మరీ తెచ్చి ఇచ్చారు. సుమారు రూ. కోటి దాకా అప్పులు చేసినట్లు తెలిసింది. కూతురు వివాహ కార్యక్రమం ముగియగానే ఇస్తానని చెప్పడంతో కొందరు ఎలాంటి బాండ్లు రాయించుకోకుండా లక్షలు రూపాయలు ఇచ్చారంటే స్నేహితుడిపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. కూతురు పెళ్లితంతు పూర్తవగానే కొద్ది రోజుల తర్వాత ఈరోజు రేపు అంటూ అప్పులిచ్చిన వారికి చెబుతూ వచ్చిన కృష్ణమోహన్ హైడ్రామాకు తెరతీశాడు.
 ఎవరికీ కనిపించ కుండా అదృశ్యమయ్యాడు. ఈ క్రమంలో తన భర్త కనిపించడంలేదంటూ కృష్ణమోహన్ భార్య త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుటుంబ సభ్యుల సహకారంతోనే కృష్ణమోహన్ అదృశ్యమయ్యాడంటూ బాధితులు ఆరోపించారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత తాజాగా కృష్ణమోహన్ 37 మంది బాధితులకు న్యాయవాది ద్వారా ఐపీ నోటీసులు జారీ చేయించాడు. 37 మందికి రూ. 76, 63,000 అప్పులున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. పైగా తాను వేరుశనగ, బియ్యం వ్యాపారం చేస్తూ తీవ్రంగా నష్టపోయానని పేర్కొన్నాడు.
 
 కొందరు బాధితులకు చెక్కులు
 ఐపీనోటీసులు జారీ చేసిన 37 మందికి కాకుండా మరికొంతమందికి కృష్ణమోహన్ తన భార్య పేరుతో చెక్కులు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో వారికి మాత్రం ఈ  ఐపీ నోటీసులు ఇవ్వలేదని సమాచారం. వారందరికీ అప్పులు చెల్లించేందుకు కుటుంబ సభ్యులు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే వడ్డీ కోసమే ఇచ్చిన బాధితులకు వదిలిపెట్టి, స్నేహం కోసం అప్పులిచ్చిన బాధితులకు అధికశాతం ఐపీ నోటీసులు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఇదిలా ఉండగా చాలామంది బాధితుల వద్ద కృష్ణమోహన్ రూ. 2,3 వడ్డీకి తీసుకుని రూ. 5,10 ప్రకారం అప్పులిచ్చేవాడని స్థానికులు, పోలీసులు చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు