దోపిడీకి చెక్‌

26 Aug, 2019 08:18 IST|Sakshi

ముడుపుల  బాహుదా ప్రాజెక్టుకు బ్రేక్‌

సీఎం జగన్‌ ఆదేశాలతో బెడిసి కొట్టిన చంద్రబాబు  అండ్‌ కో వ్యూహం

ప్రభుత్వానికి వేల కోట్లు ఆదా

2015లో రూ.1075 కోట్లతో అంచనాలు

2019నాటికి రూ.6,326.62  కోట్లకు పెరిగిన వైనం

వంశధార, బాహుదా నదుల అనుసంధానం కోసం ఎన్నికల ముందు  తెరపైకి డీపీఆర్‌

ఫిబ్రవరిలో టెండర్లు ఖరారు.. మార్చిలో అగ్రిమెంట్‌

 డీపీఆర్‌పైనే అనుమానాలు

పరిశీలనలోనే ఇంజినీరింగ్‌  అధికారుల అభ్యంతరాలు

విజిలెన్స్‌ విచారణలోనూ వెలుగు చూసిన లొసుగులు, లోపాలు 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించకపోయి ఉంటే... పునఃసమీక్ష చేయకపోయినట్టయితే వంశధార, బాహుదా నదుల అనుసంధానం పేరుతో చంద్రబాబు ప్రభుత్వం డిజైన్‌ చేసిన రూ.6,326.62 కోట్ల ప్రాజెక్టు గోల్‌మాల్‌ అయ్యేది. గత ప్రభుత్వ హయాంలో ఖరారైన పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి ఉంటే వేల కోట్ల రూపాయల ప్రజాధనం నాటి పెద్దలకు సమర్పణమయ్యేది. వ్యూహాత్మకంగా ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద టెండర్లు పిలిచి, ఖరారు చేసిన బాహుదా ఇంటర్‌ లింకింగ్‌ ప్రాజెక్టు పేరుతో కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చి వేల కోట్లు మింగేద్దామని భావించిన చంద్రబాబు అండ్‌ కోకు గట్టి షాకే తగిలింది. ప్రారంభం కాని ప్రాజెక్టుల కాంట్రాక్టులను రద్దు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించడంతో అందులో ఒకటైన బాహుదా ఇంటర్‌ లింకింగ్‌ ప్రాజెక్టుకు బ్రేక్‌ పడింది. దీంతో మంచి పనే అయిందని అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. లేదంటే కష్టసాధ్యమయ్యే ప్రాజెక్టుతో వచ్చే ప్రయోజనం కన్నా నిధుల దుర్వినియోగం ఎక్కువగా ఉండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వ్యూహాత్మక టెండర్లు.. 
వంశధార ప్రాజెక్టు రెండో దశలో హిరమండలం రిజర్వాయర్‌ నుంచి 110 కి.మీల.పొడవునా హైలెవల్‌ కెనాల్‌ తవ్వి ఇచ్ఛాపురం సమీపంలోని బాహుదా నదిలోకి వంశధార జలాలను తరలించి రెండు నదులను అనుసంధానం చేయాలని సర్కార్‌ నిర్ణయించింది. హిరమండలం రిజర్వాయర్‌ నుంచి తరలించడం ద్వారా ఇచ్ఛాపురం, టెక్కలి, పలాస నియోజకవర్గాల్లోని 14 మండలాల్లో 2 లక్షల ఎకరాలకు నీరందించాలనేది ప్రాజెక్టు ఉద్దేశం. ఈ కెనాల్‌కు అనుబంధంగా 8.30 టీఎంసీల సామర్థ్యంతో ఆరు రిజర్వాయర్లను నిర్మించాలని ప్రతిపాదించింది. ఆమేరకు ఎన్నికల షెడ్యూల్‌కు ముందు పరిపాలన అనుమతి ఇచ్చేసింది. ఈ పనులను ఐదు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని ఒక దశలో అధికారులు మొత్తుకున్నా వినలేదు.

చంద్రబాబు ఒత్తిడి మేరకు కేవలం రెండు ప్యాకేజీల కింద నాటి సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ పనులను ఖరారు చేశారు. 0 కి.మీ నుంచి 55 కి.మీ వరకూ కాలువ తవ్వకం, పెద్ద లోగిడి, రంగసాగరం, మల్లివీడు రిజర్వాయర్ల నిర్మాణానికి రూ.1618.24 కోట్లు, 55 కి.మీ నుంచి 110 కి.మీ వరకూ కాలువ తవ్వకం, ఆళ్లకోలి, హంసరలి, కంచిలి రిజర్వాయర్ల నిర్మాణ పనులకు రూ.2,452.85 కోట్లను అంచనా వ్యయంగా నిర్ణయించి లంప్సమ్‌–ఓపెన్‌ విధానంలో టెండర్లు పిలిచారు. టెండర్ల నోటిఫికేషన్‌ జారీ చేయకముందే తన అనుయాయులైన ఇద్దరు కాంట్రాక్టర్లు రెండు ప్యాకేజీలకు షెడ్యూల్‌ దాఖలు చేసేలా... ఒక్కొక్కరు ఒక్కో ప్యాకేజీ దక్కించుకునేలా వ్యూహరచన చేసి, ఆ కాంట్రాక్టర్‌కు ఉన్న అర్హతలనే టెండర్లలో పొందుపరిచారు. ఇంకేముంది అనుకున్నట్టే జరిగింది. వారికే కాంట్రాక్ట్‌లు దక్కాయి. రూ.1618.24 కోట్ల ప్యాకేజీని రూ.1695.11 కోట్లకు హెచ్‌ఈఎస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏజెన్సీ, రూ.2452.85 కోట్ల ప్యాకేజీని రూ.2572.06 కోట్లకు బీఎస్‌ఆర్‌ జాయింట్‌ వెంచర్‌ ఏజెన్సీ దక్కించుకున్నాయి. రెండు ప్యాకేజీలను అధిక ధరకే కేటాయించారు.

డీపీఆర్‌లోనే మస్కా..
వంశధార స్టేజ్‌–2 ఫేజ్‌ –2లో ప్రాజెక్టులో భాగమైన హిరమండలం రిజర్వాయర్‌ నుంచి బాహుదా నది వరకూ 110 కిలోమీటర్ల పొడవునా హైలెవెల్‌ కెనాల్‌ నిర్మించడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రూపొందించే బాధ్యతను రూ.2.80 కోట్లకు కాంటెక్‌ డిజైన్స్, ఇంజినీరింగ్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు అప్పగించారు. అయితే, ఆ సంస్థ ఇచ్చిన డీపీఆర్‌ అంతా లోపభూయిష్టంగా, లొసుగులమయంగా ఉందని సాక్షాత్తు ఇంజినీరింగ్‌ అధికారులే నోళ్లు వెళ్లబెట్టారు. సర్వే నెంబర్లతో కూడిన ఆయకట్టు వివరాలను ఎక్కడా పొందుపరచలేదు. కేవలం ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్టుగా, వారికి అనుకూలంగా డీపీఆర్‌ను ఆదేశించారు.

2015లో 75 వేల ఎకరాలకు రూ.1075 కోట్లతో డిజైన్‌ చేసిన ప్రాజెక్టును ఒక్కసారిగా 2 లక్షల ఎకరాలకు పెంచి రూ.6,326.62 కోట్లకు పెంచడం చూసి ఆశ్చర్యపోయారు. అంటే ఉద్దేశపూర్వకంగా ఆయకట్టు పెంచి చూపించారన్న వాదనలు ఉన్నాయి. బెనిఫిషియర్‌ కాస్ట్‌ రేషియో కింద కొండలు, గుట్టలతోపాటు చెరువులు, ఇతరత్రా సాగునీటి వనరుల కింద ఉన్న ఆయకట్టును కూడా చూపించినట్టుగా సమాచారం. వాస్తవానికైతే, వంశధార నదిలో మన వాటా 55 టీఎంసీలే. అందులో హిరమండలం రిజర్వాయర్‌ సామర్థ్యం 19 టీఎంసీలు కాగా, వంశధార్‌ లెఫ్ట్‌ మెయిన్‌ కెనాల్, వంశధార రైట్‌ మెయిన్‌ కాలువ సామర్థ్యం 20 టీఎంసీలు. ఇంకా 13.5 టీఎంసీలే మన వాటా కింద మిగిలి ఉంది. వాస్తవానికి ఒక టీఎంసీకి 10 వేల ఎకరాలను తీసుకుంటారు. ఆరు తడి పంటలు ఉన్న ఏరియా అయితే 15 వేల ఎకరాలను తీసుకుంటారు. ఈ లెక్కన చూసినా 2 లక్షల ఎకరాలకు మనకున్న వాటా ఎంత మేరకు సరిపోతుందన్నదే ప్రశ్నగానే మిగిలి ఉంది.

డీపీఆర్‌ పరిశీలనలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఇంజినీర్లు.. 
డీపీఆర్‌ ప్రకారం 17 మీటర్ల వెడల్పు, 3.30 మీటర్ల లోతుగా 110 కి.మీ పొడవునా హైలెవల్‌ కెనాల్‌ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అంతేకాకుండా కెనాల్‌ను వంశధార నదిపై నుంచి అవతలి వైపునకు తీసుకెళ్లాలంటే దాదాపు 7 కి.మీ. పొడవునా వయోడెక్ట్‌ను నిర్మించాలి. ఇది కష్టసాధ్యమే కాకుండా పర్యవేక్షణ చేయడం సంక్లిష్టమని ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. దానికి తోడు వంశధార నదిపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టి వరద కాలువ ద్వారా హిరమండలం జలాశయంలోకి నీరును మళ్లించాల్సి ఉంది. ఈ బ్యారేజీ నిర్మాణం పూర్తయితే జలాశయంలో పూర్తి సామర్థ్యం (19టీఎంసీలు) మేర నీరు చేరే అవకాశం ఉంటుంది. దీంతో జలాశయంలో గరిష్ట నీటిమట్టం 67 మీటర్ల ఎత్తున ఉంటుంది. అయితే, వంశధార– బాహుదా నదుల అనుసంధానం కోసం ప్రతిపాదించిన హైలెవెల్‌ కెనాల్‌లోకి నీరు పారాలంటే కనీసం 60.5 మీటర్ల ఎత్తున నీటిమట్టం ఉండాలి. ఇదంతా జరగాలంటే నేరడి బ్యారేజీ నిర్మాణం చేపట్టాలి. కానీ, ఒడిశా అభ్యంతరాలను పరిష్కరించకుండా బాహుదా ఇంటర్‌ లింకింగ్‌ ప్రాజెక్టును తెరపైకి తెచ్చేసి, టెండర్లు పిలిచేసింది. ఇదంతా చూస్తుంటే  ముడుపుల కోసం డిజైన్‌ చేసినట్టుగా ఉందే తప్ప ఉపయోగపడే ప్రాజెక్టు కాదనే అభిప్రాయాన్ని సాక్షాత్తు ఇంజినీర్లే వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ అవినీతి గ్రాఫ్‌...
-వంశధార, బాహుదా నదులను అనుసంధానం చేసి, 75 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు గాను రూ.1075 కోట్లతో 2015లో బాహుదా ఇంటర్‌ లింకింగ్‌  ప్రాజెక్టు రూపకల్పన చేశారు. -2019 ఫిబ్రవరి 11న ఇదే ప్రాజెక్టును 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు పెంచి రూ. 6,326.62 కోట్లతో డిజైన్‌ చేసి టెండర్ల నోటిఫికేషన్‌ పిలిచారు. ఇందులో 90 వేల ఎకరాలు స్థిరీకరణ కింద, లక్షా 10 వేల ఎకరాల కొత్త ఆయకట్టు కింద నిర్దేశించారు. అంటే నాలుగేళ్ల కాలంలో లక్షా 25 వేల ఎకరాల మేర అదనపు ఆయకట్టు చూపించారు. రూ.5,251 కోట్ల మేర అదనంగా అంచనా వ్యయం పెంచారు. అది కూడా ఎన్నికల షెడ్యూల్‌కు ముందు డిజైన్‌ చేసి, ఫిబ్రవరి 11న టెండర్లు పిలిచారు. అదే నెల 27న ప్రైస్‌బిడ్‌ టెండర్లు తెరిచారు. నాటి సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా జోక్యం చేసుకుని ఆగమేఘాల మధ్య ప్రాజెక్టు డిజైన్‌ దగ్గరి నుంచి టెండర్లు పిలిచే వరకు తతంగం నడిపారు. దానికి అప్పట్లో పనిచేసిన బీఆర్‌ఆర్‌ వంశధార ప్రాజెక్టు సర్కిల్‌ సూపరింటెండెంట్‌ను పావుగా వాడుకున్నారు. దీంతో ఇది కేవలం ముడుపుల కోసమేనని, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే ప్రాజెక్టేనని అప్పుడే అంతా భావించారు. 

విజిలెన్స్‌ విచారణలో బయటపడ్డ లొసుగులు..
విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు చేపట్టిన విచారణలో కూడా ప్రాజెక్టు లోపాలను, లొసుగులను ఎత్తిచూపినట్టు చూపినట్టు తెలిసింది. డీపీఆర్‌నే మేనేజ్‌ చేసినట్టుగా గుర్తించినట్టు సమాచారం. 2015లో 75 వేల ఎకరాలతో డిజైన్‌ చేసిన ప్రాజెక్టును ఇప్పుడు 2 లక్షల ఎకరాలకు పెంచడాన్ని కూడా తప్పు పట్టినట్టు తెలిసింది. 
పక్కా వ్యూహంతో ఆయకట్టును పెంచి చూపించారని, ఇందులో నాటి సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ పాత్రను ప్రస్తావించి ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చినట్టు తెలియవచ్చింది. ఇన్ని అనుమానాలున్న ప్రాజెక్టుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో బ్రేక్‌ పడింది. ప్రారంభం కాని ప్రాజెక్టులను రద్దు చేయాలని ఆదేశించడంతో చంద్రబాబు అండ్‌ గ్యాంగ్‌కు గట్టి షాక్‌ తగిలినట్టు అయింది. 

ప్రభుత్వ ఆదేశాలతో రద్దు చేశాం..
ప్రారంభం కాని ప్రాజెక్టులలో బాహుదా ఇంటర్‌ లింకింగ్‌ ప్రాజెక్టు ఉండటంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు రద్దు చేశాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్‌ అధికారులు విచారణ కూడా చేపడుతున్నారు. ఇప్పటికే వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు, డీపీఆర్‌ తది తర వివరాలు అన్నింటిని తీసుకున్నారు. డీపీఆర్‌పైనే అనుమానాలు ఉన్నాయి. తమకు పలు ప్రశ్నలు కూడా సంధించారు. ఇదే క్రమంలో పనులు దక్కించుకున్న ఒక ప్యాకేజీ కాంట్రాక్టర్ల ఇప్పటికే తమ బ్యాంకు గ్యారంటీని వెనక్కి తీసుకున్నారు. 
–పి.రంగారావు, బీఆర్‌ఆర్‌ వంశధార ప్రాజెక్టు సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు