నీటి గంట.. మోగునంట! 

19 Nov, 2019 04:55 IST|Sakshi

విద్యార్థులు నీళ్లు తాగేందుకు రోజుకు నాలుగుసార్లు విరామం 

విద్యార్థుల ఆరోగ్య రక్షణకు సర్కారు ఆదేశం 

సాక్షి, అమరావతి: విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో ‘నీటి గంట’ మోగుతోంది. రోజుకు నాలుగుసార్లు పాఠశాలల్లో ‘నీటి గంట’ మోగించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ఆర్‌జేడీలు తమ పరిధిలోని డీఈవోలు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో హాజరు శాతం తక్కువగా ఉండటానికి విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతుండటమే కారణమని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ప్రధానంగా జ్వరాలు, డీహైడ్రేషన్, నిస్సత్తువ, మూత్రపిండాల్లో రాళ్లు తదితర సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. తరగతుల సమయంలో రోజుకు కనీసం నాలుగుసార్లు విద్యార్థులతో నీళ్లు తాగిస్తే సాధారణ అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచవచ్చని సూచించారు. దాంతో విద్యార్థులు తగినన్ని నీళ్లు తాగేందుకు వీలుగా పాఠశాలల్లో ‘నీటి గంట’ విధానాన్ని అమలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది.  

సమయాలివీ.. 
- ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉదయం 9.30 గంటలు, 11.15 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, సాయంత్రం 3.15 గంటలకు ‘నీటి గంట’ మోగిస్తారు.  
- ఉన్నత పాఠశాలల్లో ఉదయం 10.05 గంటలు, మధ్యాహ్నం 12.30 గంటలు, మధ్యాహ్నం 2.30 గంటలు, సాయంత్రం 4.10 గంటలకు మోగిస్తారు.  
- ఆ వెంటనే తరగతులకు రెండు నిమిషాలు విరామం ఇస్తారు.  
- పాఠశాలల్లోనూ విద్యార్థుల కోసం తగినన్ని మంచినీళ్లు అందుబాటులో డీఈవో, ఎంఈవో,  ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు అందాయి. ‘నీటి గంట’ విధానం అమలును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటామని విద్యా శాఖ పేర్కొంది. దీనిని సరిగా అమలు చేయకపోతే తగిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.  

మరిన్ని వార్తలు