వృద్ధురాలి దీక్ష భగ్నం

18 Jul, 2018 12:13 IST|Sakshi
108లో మహాలక్ష్మిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం  

రేగిడి: ఆస్తి కోసం దేవకివాడ మహాలక్ష్మి చేస్తున్న దీక్షను పక్కా పన్నాగం వేసిన రేగిడి పోలీసులు బలవంతంగా భగ్నం చేశారు. గత వారం రోజులుగా మండలంలోని బూరాడ గ్రామానికి చెందిన మహాలక్ష్మి తన ఆస్తి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కోసం దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. వృద్ధాప్యంలో తనను ఒంటరిని చేసి అయినవారు, ఆప్తులు తన ఆస్తిని దోచుకోవడంపై మండిపడింది.

దీనిపై పంచాయతీ పెద్దలు, అధికారులను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో నిరాహార దీక్షకు ఉపక్రమించింది. వారం రోజులుగా ఆమె దీక్ష చేస్తుంటే ఎవరూ పట్టించుకోలేదు. పాలకులు కనికరించ లేదు. అయినప్పట్టకీ పట్టు వదలకుండా తన ప్రాణాన్ని పనంగా పెట్టి దీక్ష చేస్తుండగా.. ఆరోగ్యం క్షీణించింది. పరిస్థితి అంతకంతకూ ప్రమాదకరంగా మారడంతో రేగిడి పోలీసులు పన్నాగం పన్నారు.

దీక్ష వద్ద ఎవరూ లేని సమయం చూసి మంగళవారం సాయంత్రం దీక్షా శిబిరం వద్దకు చేరుకొని వృద్ధారాలిని బలవంతగా 108 వాహనంలో రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యంపై అప్రమత్తమైన ఎస్‌ఐ జి.భాస్కర్రావు తగు న్యాయం జరిగేటట్టు చూస్తామని, ముందు ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయిస్తామని నచ్చజెప్పారు.

అయితే... తన ఆస్తి తనకు దక్కే వరకు పోరాటం విరమించేది లేదని తెగేసి చెప్పిన బాధితురాలు వైద్యానికి నిరాకరించింది. వైద్యులు బలవంతంగా ఆమెకు చికిత్సను అందిస్తున్నారు. ఇదిలా ఉండగా... ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దీక్ష ఆగదని, తనకు న్యాయం జరిగే వరకు మహాలక్ష్మి పోరాటం చేస్తుందని బాధితురాలి కుమార్తె కల్యాణి, మేనల్లుడు శీర రాధాకృష్ణ తెలిపారు.

మరిన్ని వార్తలు