చేపల చెరువు తవ్వకానికి బ్రేక్

16 Jun, 2014 02:22 IST|Sakshi

నందివాడ : హైకోర్టు ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని తమిరిశలో పొక్లెయిన్‌తో చేపల చెరువు తవ్వకం పనులు నిర్వహిస్తుండగా గ్రామస్తులు ఆది వారం అడ్డుకున్నారు. మండల కేంద్రమైన నందివాడలో శనివారం చెరువులు తవ్వాలనుకున్న వ్యక్తులే ఆది వారం తమిరిశలో కూడా ఇందుకు యత్నించారు. నందివాడలో మాదిరి గానే తమిరిశలో కూడా గ్రామస్తులు తవ్వకం పనులను అడ్డుకున్నారు. దీంతో పనులు నిలిచిపోయాయి.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సార్వా, దాళ్వా పండే పొలా లను ఇలా చేపల చెరువులుగా మార్చడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్ధం కావటం లేదన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే చేపల చెరువు యజమానులకు పాలకులు ఎలా సహకరిస్తున్నారో తెలియటం లేదన్నారు. గ్రామంలో చేపల చెరువు తవ్వకం పనులపై సోమవారం మచిలీపట్నంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. చేపల చెరువులకు మండల అధికారులే పరోక్షంగా సహకరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

రెండు పంటలు పండే బంగారంలాటి భూములను  చెరువులుగా మార్చడానికి అధికారులు ఎలా ఫైల్ పెడుతున్నారో అర్ధం కావటం లేదంటున్నారు. ఫైళ్లను కలెక్టర్‌కు పంపించటంలో అలస్యం జరుగుతుండటంతో భూముల యజమానులు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నట్లు తెలి పారు. అదే మొదటిలోనే వ్యవసాయ భూముల్లో చెరువుల తవ్వకం కుదరదని చెబితే సరిపోతుందన్నారు. అవసరమైతే అధికారుల తీరుపై కోర్టుకు సైతం వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామంలో చెరువుల తవ్వకాలు జరగనివ్వమని వారు పేర్కొంటున్నారు.  
 
చుట్టూ చెరువులేగా..


గ్రామ పరిధిలోని పలుచోట్ల చెరువులు తవ్వినపుడు గ్రామస్తులు ఏం చేస్తున్నారని కొతగా తవ్వకాలు తల పెట్టిన భూముల యజమానులు ప్ర శ్నిస్తున్నారు. అప్పుడు చూసీ చూడనట్లు వదిలేసి ఇప్పుడు ఇలా అడ్డుకోవటం అన్యాయమని వారు అంటున్నారు. చుట్టూ చేపల చెరువులు ఉండటంతో తమ భూముల్లో పంట లు సక్రమంగా పండటం లేదని చెబుతున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని వారు పేర్కొంటున్నారు.
 

మరిన్ని వార్తలు