ఫైలు కదలాలంటే... చేయి తడపాల్సిందే!

27 Jun, 2020 10:05 IST|Sakshi

కారుణ్యా నియామకాలకూ లంచం డిమాండ్‌

కలెక్టరేట్‌ ఏ– సెక్షన్‌లో అవినీతి బాగోతం

బాధితుని వాట్సాప్‌ మెసేజ్‌లతో వెలుగులోకి

ఉన్నతాధికారుల మెయిల్స్‌కు అవినీతి చిట్టా

జిల్లాలోని అన్ని శాఖలకు ఆదర్శంగా ఉండాల్సిన కలెక్టరేట్‌లో అవినీతి దర్శన మిస్తోంది. కలెక్టరేట్‌లోని ఏ–సెక్షన్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ అవినీతి బాగోతం వాట్సాప్‌ మెసేజ్‌ల ఆధారాలతో బట్టబయలైంది. అసలే కుటుంబ యజమాని మృతి చెంది దీనస్థితిలో ఉంటూ..కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న బాధితులనే ఈ ఉద్యోగి లంచం డిమాండ్‌ చేయడం ఆ శాఖకే మచ్చ తెస్తోంది. కలెక్టర్‌ కార్యాలయంలో అతి ముఖ్యమైన ఏ–సెక్షన్‌లో అవినీతి వ్యవహారం బయటపడడం చర్చనీయాంశమైంది.

చిత్తూరు కలెక్టరేట్‌ : కలెక్టరేట్‌లో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అవినీతిరహిత పాలన అందజేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అవినీతికి పాల్పడే ఎంతటి అధికారినైనా, ఉద్యోగినైనా సహించేది లేదని కఠిన చర్యలుంటాయని పలు మార్లు హెచ్చస్తున్నారు. అయినా కలెక్టరేట్‌ కార్యాలయంలోనే అవి నీతి తంతు విస్మయానికి గురి చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఆకస్మికంగా మృతిచెందితే వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలివ్వాల్సి ఉంటుంది. జిల్లాలోని పలు శాఖల్లో ఆకస్మికంగా మృతి చెందిన ఉద్యోగుల కుటుంబీకులకు ఉద్యోగాలిచ్చే నివేదికలు కలెక్టరేట్‌కు వచ్చాయి. ఈ నివేదికలను పర్యవేక్షించే ఏ–సెక్షన్‌లోని ఏ–7 జూనియర్‌ అసిస్టెంట్‌ అవినీతిని పాల్పడేందుకు స్కెచ్‌ వేశారు. వచ్చిన నివేదికల్లోని చిరునామాల ఆధారంగా గుట్టుచప్పుడు కాకుండా లంచం కోసం ప్రయత్నించారు. వారి నుంచి డబ్బులు డిమాండ్‌ చేశారు. కారుణ్య నియామకానికి అర్హత ఉన్న ఓ బాధితుడు సంవత్సరకాలంగా ఉద్యోగం కోసం కాళ్లరిగేలా కలెక్టరేట్‌ చుట్టూ ప్రదక్షణ చేస్తున్నాడు. కరుణించని కలెక్టరేట్‌ ఏ–సెక్షన్‌ అధికారుల తీరుతో ఆ బాధితుడు విసిగిపోయాడు. చిట్టచివరిగా ఏ–7 సెక్షన్‌ చూసే సిబ్బందికి లంచం ఇచ్చేనా ఉద్యోగం పొందేందుకు సిద్ధమయ్యాడు. ఏ–7 ఉద్యోగి ఫోన్‌ నంబర్‌ను తీసుకుని వాట్సాప్‌ ద్వారా సంభాషణ జరిపాడు.

దొరికాడు ఇలా....
ఆ ఉద్యోగికి లంచం ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్న బాధితుడు చివరికి ఇలా చేశాడు.. కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్ల మెయిల్‌ ఐడీలను ఆ బాధితుడు తెలుసుకున్నాడు. ఏ7 ఉద్యోగితో జరిపిన వాట్సాప్‌ సంభాషణల ఆధారాలను ఆ మెయిల్‌ ఐడీలకు పంపాడు. ఈ విషయం సాక్షి దృష్టికి వచ్చింది. పూర్తిస్థాయి వివరాల కోసం సాక్షి మరింత సమా చారాన్ని సేకరించింది. 

సంవత్సరాల కొద్దీ పాతుకుపోయారు
కలెక్టరేట్‌లోని పలు విభాగాల్లో కొంతమంది ఉద్యోగులు సంవత్సరాల కొద్దీ  పాతుకుపోయారు. ఏళ్లు గడుస్తున్నా వారు మాత్రం మరో చోటకు బదిలీ అయిన దాఖలాలు లేవు. ముఖ్యంగా ఏ–సెక్షన్‌లో కొందరు ఏళ్ల తరబడి ఒకే సీటులో తిష్ట వేశారు. ఇలాంటి పరిస్థితుల వల్లే అవినీతికి తావిస్తోంది. కొందరు చేస్తున్న తప్పులకు ఆ శాఖ మొత్తానికి చెడ్డ పేరు వస్తోంది. కలెక్టర్‌ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి కలెక్టరేట్‌లో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

వాట్సాప్‌ సంభాషణ ఇలా.. 
బాధితుడు :  సార్, చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం తిరుగుతున్నాను.  
ఏ7 ఉద్యోగి : ఒక సంవత్సరమా.. రెండు సంవత్సరాలా...
బాధితుడు : ఒక సంవత్సరానికి పైగా సార్‌... ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారా సార్‌...
ఏ7 ఉద్యోగి : ఎస్‌... నువ్వు అనుకుంటే త్వరగా అవుతుంది... మంచి డిపార్టుమెంట్‌ కూడా  
బాధితుడు : నేను ఏమీ చేయాలి సార్‌..
ఏ7 ఉద్యోగి : రూ.80వేలు  
బాధితుడు : సార్, నేను చాలా పేదవాణ్ణి... నా పరిస్థితిని, కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకోండి
ఏ7 ఉద్యోగి :  రూ.65 వేలు  
బాధితుడు : సార్, ప్లీజ్‌ దండం పెడుతాను.. ప్రస్తుతం నా కుటుంబ పరిస్థితులకు ఉద్యోగం చాలా ముఖ్యం సార్,
ఏ7 ఉద్యోగి :  ఓకే, రూ.50 వేలు ఫైనల్‌
ఏ7 ఉద్యోగి :  ప్రశ్న గుర్తును పెడుతూ... ఓకే.. ఇక నీఇష్టం... గుడ్‌లక్‌

చర్యలుంటాయ్‌
అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోను సహించేది లేదు. ఏ–సెక్షన్‌లోని ఏ7 ఉద్యోగిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేస్తాం. తప్పు తేలితే కఠినచర్యలు ఉంటాయ్‌. ఉద్యోగాల కోసం ఎవ్వరూ ఏ అధికారికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా లంచం అడిగితే నిర్భయంగా నాకు ఫిర్యాదు చేయవచ్చు.    – నారాయణభరత్‌గుప్తా, కలెక్టర్‌

మరిన్ని వార్తలు