ఖర్మాస్పత్రులు

24 Feb, 2018 13:40 IST|Sakshi
ఆస్పత్రి ఓపీ విభాగం వద్ద వందలాదిగా వేచి ఉన్న రోగులు, బంధువులు

 అరకొర వైద్యంతో అల్లాడుతోన్న రోగులు

పెరుగుతున్న శిశు మరణాలు, అపహరణలు

అడుగడునా వైద్యుల బాధ్యతా రాహిత్యం

సిబ్బంది లేక సేవలు మృగ్యం

వసతులూ అంతంత మాత్రమే

రాజమహేంద్రవరం జీజీహెచ్‌ దుస్థితి

పుట్టిన బిడ్డకు రక్షణ లేదు.. ప్రాణాలకు భరోసా లేదు.. వైద్యుల మధ్య సమన్వయం లేదు.. లంచం ఇవ్వందే శవం కూడా లేవదు... ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు.. సీరియస్‌ కేసులైనా సోసో అన్నధోరణి.  ధర్మాస్పత్రిగా పేరున్న కాకినాడ ప్రభుత్వాస్పత్రి ఇప్పుడు ‘ఖర్మాసుపత్రి’గా తయారైంది. జిల్లా కేంద్రంలోని బోధనాస్పత్రి, రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి పనితీరుపై ‘సాక్షి’ పరిశీలనలో వెలుగుచూసిన పలు అంశాలు రోగుల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని స్పష్టం చేస్తున్నాయి.

కాకినాడ: ఉభయ గోదావరి జిల్లాల్లోని పేదరోగులకు సేవలందించాల్సిన కాకినాడ జీజీహెచ్‌ తీరు అత్యంత దయనీయంగా తయారైంది. రోగులకు ఏ మాత్రం భద్రతలేని పరిస్థితి. పురిటి కోసం వచ్చిన మహిళలకు పుట్టిన బిడ్డను క్షేమంగా ఇస్తారన్న భరోసా లేదు. దశాబ్దాల నాటి విద్యుదీకరణ వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని రోగులు ఆందోళన చెందుతున్నారు. వైద్యుల తీరు రోత పుట్టిస్తోంది. 1978లో 1065 పడకలతో ప్రారంభమైన జీజీహెచ్‌లో ఇప్పటికీ అదే సంఖ్య కొనసాగుతోంది. మారిన పరిస్థితులు, పెరిగిన రోగులకు అనుగుణంగా కనీసం మరో వెయ్యి అదనపు పడకలు అవసరమన్న నివేదికలను యంత్రాంగం దాదాపు బుట్టదాఖలు చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లెక్కల ప్రకారం 270 మంది వైద్యులకు ప్రస్తుతం 217 మంది మాత్రమే పని చేస్తున్నారు. వివిధ విభాగాల్లో 622 మంది సిబ్బందికి బదిలీలు, పదోన్నతులు, పదవీ విరమణలతో 218 మంది వైదొలగినా నాలుగైదు ఏళ్లుగా కొత్త నియామకాలు జరగని పరిస్థితి నెలకొంది.

రోగులకు ఇవ్వాల్సిన ఉచిత మందులు కూడా 60 శాతం మాత్రమే అందిస్తున్నట్టు సంబంధిత వర్గాల సమాచారం. నిత్యం సరాసరి 3,500 మంది రోగులు సందర్శించే ఆస్పత్రిలోని ఓపీల వద్ద, ఆపరేషన్‌ థియేటర్ల వద్ద రోగులు, వారి బంధువులు కూర్చునేందుకు కూడా కనీస వసతులు లేని పరిస్థితి నెలకొంది. ఆస్పత్రిలో ఐదు జనరేటర్లు ఉన్నా కేవలం అత్యవసర సేవలకు మాత్రమే వినియోగిస్తున్నారు. స్ట్రెచర్లు, వీల్‌చైర్లు అందుబాటులో ఉన్నా వాటిని తరలించే సిబ్బంది కొరత వల్ల చాలా వరకు నిరుపయోగంగా ఉన్నాయి. ఇక సెక్యూరిటీ గార్డులు, ఔట్‌సోర్సింగ్‌ పారిశుద్ధ్య సిబ్బందికి నాలుగు నెలలుగా జీతాలు లేక ఆస్పత్రి ఆవరణ అధ్వానంగా తయారైంది. అనేక వార్డుల్లో పందులు, కుక్కలు, పశువులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. వైద్యులు మొక్కుబడిగా హాజరై ప్రైవేటు ప్రాక్టీసుకు వెళ్లిపోతుండడంతో ఇక్కడి రోగులకు పూర్తిస్థాయి వైద్యం అందడం లేదు. ఇటీవల కాలంలో అధ్వానంగా ఉన్న వైరింగ్‌ల వల్ల తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. మార్చురీ, ఇతర విభాగాల వద్ద  సిబ్బంది లంచగొండితనం రోగులకు శాపంగా మారింది.

మూతపడ్డ విభాగాలు
కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రధానమైన విభాగాలు దాదాపు మూతపడ్డ పరిస్థితి నెలకొంది. కార్డియో థొరాసిక్‌ సర్జరీ విభాగం దాదాపు మూతపడినట్లేనని వైద్య వర్గాలు చెబుతున్నాయి. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం ఉన్నా వైద్యుడు లేక అనాథగా మారింది. కార్డియాలజీ విభాగం నిరుపయోగంగా తయారైంది. కాకినాడ, విశాఖ ఆస్పత్రులకు కలిపి ఒకే కార్డియాలజిస్టు ఉండడంతో సదరు వైద్యుడు రెండు రోజులు ఇక్కడ, మూడు రోజులు అక్కడ పనిచేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే ప్రధాన కార్డియాలజీకి చీఫ్‌ లేని దుస్థితి ఈ ప్రాంతానికి నెలకొంది. అలాగే అత్యధిక శాతం రోగులు ఇబ్బందులు ఎదుర్కొనే యూరాలజీ విభాగానికి గతంలో ఉండే డాక్టర్‌ బాదం సురేంద్రబాబు స్వచ్ఛంద  పదవీ విరమణ చేయడంతో ఆ విభాగం నిరుపయోగంగా మారింది. ఇలా  ప్రభుత్వాస్పత్రిని సమస్యలు పట్టి పీడిస్తున్నాయి.

మరిన్ని వార్తలు