పెళ్లింట చావు మేళం!

11 Jun, 2020 13:56 IST|Sakshi
మృతి చెందిన కుళ్లాయప్ప (ఫైల్‌)

గుండెపోటుతో పెళ్లికుమార్తె తండ్రి మృతి

డోన్‌లో విషాదం

కర్నూలు, డోన్‌ టౌన్‌: పెళ్లి వాయిద్యాలు మోగాల్సిన ఆ ఇంట్లో చావు మేళం మోగింది. రోజు గడిస్తే వివాహ వేడుక మొదలుకావాల్సి ఉండగా.. పెళ్లికుమార్తె తండ్రి అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయారు. దీంతో ఆ  ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. డోన్‌ పట్టణంలోని పాతపేట రాముల దేవాలయం ఎదుట నివాసం ఉండే రాజా కుళ్లాయప్ప(49)  గత 15 ఏళ్లుగా ఎల్‌ఐసీ, అగ్రిగోల్డ్‌ ఏజెంటుగా ఉంటూ కుటుంబాన్ని పోషించేవారు.

ఈయన కుమార్తెకు మండలంలోని సీతంగుంతలకుచెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. వాస్తవానికి ఏప్రిల్‌ 9,10 తేదీల్లో పెళ్లి జరగాల్సి ఉండేది. లాక్‌డౌన్‌ వల్ల వాయిదా వేశారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో ఈ నెల 11,12 తేదీల్లో ముహూర్తం నిర్ణయించారు. ఇప్పటికే పెళ్లి పత్రికలు సైతం పెంచిపెట్టారు. కాగా.. బుధవారం తెల్లవారుజామున రాజా కుళ్లాయప్పకు గుండెపోటు వచ్చింది. గమనించిన  కుటుంబ సభ్యులు  హుటాహుటిన కర్నూలులోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న బంధువులు, కాలనీవాసులు  తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పెళ్లికి హాజరు కావాల్సిన తాము చావుకు రావాల్సి వస్తుందని కలలోనూ ఊహించలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

మరిన్ని వార్తలు