వధువు కావలెను!

16 May, 2017 04:51 IST|Sakshi
వధువు కావలెను!

జిల్లాలో తీవ్రమవుతున్న ఆడ పిల్లల కొరత
♦  భ్రూణ హత్యలూ ఓ కారణం
1000@ 948గా ఉన్న నిష్పత్తి
ఇదే పరిస్థితి కొనసాగితే కన్యాశుల్కం తప్పదంటున్న సామాజిక వేత్తలు   


వధువు కావలెను... ఆలోచనకు హాస్యంగా ఉన్నా ఇది నిజం. జిల్లా ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలో ఇదీ ఒకటి. జిల్లాలోని యువకులకు వధువులు దొరకడం లేదు. ఒకప్పుడు ఆడపిల్లలపై చూపించిన వివక్ష ఇప్పుడు తిరిగి సమాజంపై ప్రభావం చూపుతోందని సామాజికవేత్తలు అంటున్నారు. భ్రూణ హత్యల కారణంగానే జిల్లాలో ఆడపిల్లల సంఖ్య బాగా తగ్గిపోయిందని వారు అభిప్రాయపడుతున్నారు. ఆఖరకు పక్క జిల్లాలు, పక్క రాష్ట్రాలకు వెళితే గానీ చాలా మందికి వివాహం కావడం లేదు.    

వజ్రపుకొత్తూరు(పలాస) : జిల్లాకు పెళ్లి గండం దాపురించినట్టుంది. గతంలో ఎన్నడూ చూడని సమస్య జిల్లాలో అంతకంతకూ తీవ్రమవుతోంది. వేలకు వేలు జీతాలు అందుకుంటున్నా, ఎన్ని ఎకరాల పొలం ఉన్నా యువకులకు వివాహాలు కుదరడం లేదు. కట్నం వద్దం టున్నా, కండీషన్లు తగ్గిస్తున్నా యువతులు మాత్రం ఎక్కడా దొరకడం లేదు.

ఉన్నత విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారు తమ స్థాయి వారినే కోరుకుంటున్నారు. టీచర్‌ అయితే టీచర్‌ను, డాక్టర్‌ అయితే డాక్టర్‌ను, ఇంజినీర్‌ అయితే ఇంజినీర్‌ను కావాలంటున్నారు. దీంతో సహజంగానే వధువుల కొరత ఏర్పడుతోంది. ఇలాంటి ఆశలు ఉన్న వారు జిల్లాలు, రాష్ట్రాలు దాటితే గానీ పెళ్లి చేసుకోలేకపోతున్నారు.  

అసలేం జరుగుతోంది..?
ఓ నలభై ఏళ్లు వెనక్కు వెళితే పెళ్లి తంతే వేరు. పెళ్లి కుదుర్చుకుంటే కులం, గోత్రమే కాదు ముందు ఏడు తరాలు..వెనుక ఏడు తరాలు చరిత్ర చూసేవారు. మన ముందు తరాలు చెప్పినదాన్ని బట్టి అప్పట్లో మగవారి కంటే ఆడవారే ఎక్కువ. కట్న కానుకలు ఇచ్చి కన్యాదానం చేసేవారు. కానీ అప్పట్లో ఆడపిల్లలపై చూపిన వివక్ష నేటి తరంపై ప్రభావం చూపిస్తోంది. లింగ నిర్ధారణతో భ్రూణ హత్యలు పెరిగి ఆడ పిల్లల సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది.

ఆర్‌ఎంపీ వైద్యులు పెరగడం, స్కానింగ్‌ సెంటర్లు అందుబాటులోకి రావడం, ప్రైవేటు వైద్యులు అడ్డూ అదుపు లేకుండా వ్యవహరించడంతో గర్భంలోనే చాలా మంది ఆడపిల్లలను చిదిమేశారు. అప్పట్లో ప్రభుత్వం కూడా ఉదాసీనంగా వ్యవహరించడంతో ఈ దాడి చాలా కాలం కొనసాగింది. దీంతో చాలా కులాల్లో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.  

ఇతర రాష్ట్రాలకు పరుగులు
ఒకప్పుడు పెళ్లిని పెద్దలు కుదిర్చేవారు. ప్రస్తుతం వివాహ వేదికలు, మ్యారేజ్‌ బ్యూరోలు కుదుర్చుతున్నాయి. జిల్లాలో ప్రధానంగా మత్స్యకార, కాళింగ, యాదవ, కాపు సామాజిక వర్గాల్లో వధువులకు కొరత ఉంది. అందుకే వీరికే ఎక్కువగా వివాహ వేదికలు వెలుస్తున్నాయి. ఇందులో కొన్ని సేవా దృక్పథంతో పని చేస్తుండగా మరి కొన్ని వ్యాపార దృక్పథంతో పని చేస్తున్నాయి. వివాహ వ్యవస్థలో వీటి పాత్ర క్రియాశీలకంగా మారింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వారు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, బరంపురం(ఒడిశా)తోపాటు మరికొన్ని రా ష్ట్రాలకు పరుగులు పెడుతున్నారు. కొంత మంది అక్కడే ఉండి అమ్మాయిని చూసుకుని పెళ్లి ఖర్చు అంతా వారే భరించి వివాహం చేసుకుంటున్నారు. మరి కొంత మంది ఎదురు కట్నం ఇచ్చి వివాహం చేసుకుంటున్నారు. కొంత మంది రెండు వైపులా ఖర్చులు తామే భరిస్తామని చెబుతున్నా అమ్మాయిలు దొ‡రకని పరిస్థితి ఉంది. దీంతో తమకు అనుబంధంగా ఉన్న కులాల వారిని వెతికి మరీ పెళ్లి చేసుకుంటున్నారు.

 ఇరవై ఏళ్ల కిందటి తప్పు
ఇరవై ఏళ్ల కిందట ఆడపిల్లలపై చూపిన వివక్ష ఇప్పుడు ఆడపిల్లల సంఖ్య తగ్గడానికి కారణం. అప్పుడే సామాజిక పరమైన మార్పు, చట్టాలు పూర్తి స్థాయిలో అమలై ఉంటే నేడు ఈ పరిస్థితి దాపురించేదే కాదు. వన్‌ ఆర్‌ నన్‌ అనే ఆలోచన ప్రభుత్వాలు తీసుకురావడం వల్ల పుట్టబోయే బిడ్డ మగ అయితే ఉంచుతున్నారు. ఆడపిల్ల అయితే తెంచుకునే పరిస్థితి తెచ్చారు. ఇదే ప్రమాదకరం. నేను పెళ్లిళ్ల ముహూర్తాలకు వెళ్లే సమయంలో ‘రెండేళ్ల నుంచి అమ్మాయి కోసం తిరుగుతున్నామండీ’ అని చాలా మంది దగ్గర విన్నాను. ప్రస్తుత పరిస్థితిని చూస్తే కొద్ది రోజుల్లోనే కన్యాశుల్కంకు దారితీసే పరిస్థితి కనిపిస్తోంది.      
– రేజేటి బోసుబాబుశర్మ,  పురోహితులు, పాతటెక్కలి

 మార్పు రావాల్సిందే
భ్రూణ హత్యలు పెరగడం వల్ల ఆడపిల్లల కొరత ఏర్పడింది. స్త్రీ , పురుషుల మధ్య నిష్పత్తి సమతూకం కావాలి. కాని ప్రస్తుతం 1000 మంది అబ్బాయిలకు 948 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు. పెళ్లినాటి వయస్సు స్త్రీ, పురుషుల మధ్య తక్కువగా ఉండాలన్న మూఢ నమ్మకం, గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులకు అబ్బాయే కావాలన్న ఆలోచన, నిరక్షరాస్యత ప్రస్తుతం ఈ పరిస్థితికి కారణం. ఇవి ఆగాలంటే భ్రూణ హత్యలను ఆపి ఆ చట్టాన్ని మరింత పటిష్టం చేయాలి. సామాజికంగా మార్పు రావాలి.
– పైల కృష్ణప్రసాద్, ఎంఈఓ,
సామాజిక వేత్త, వజ్రపుకొత్తూరు

మరిన్ని వార్తలు