కాడి దించిన ఎద్దులా.. కుప్పకూలింది..

10 Oct, 2017 12:18 IST|Sakshi
పుల్లేటికుర్రులో కూలిపోయిన వంతెన

తూర్పుగోదావరి, అంబాజీపేట(పి.గన్నవరం): కాడి భుజాన వేసుకుని చేలనుదున్ని, పండిన పంటలను ఊరికి చేర్చే ఎద్దులా.. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు లక్షల మందిని, వాహనాలను మోసిన వారధి అది. అలసిసొలసిన ఎద్దు కాడి మెడ మీదుండగానే నేలకొరిగినట్టు.. కుండపోత వాన దెబ్బకు కాలువలోకి కుప్ప కూలింది. పుల్లేటికుర్రు పంచాయతీ పరిధిలో వ్యాఘ్రేశ్వరం మీదుగా మోడేకుర్రు వెళ్ళేందుకు అప్పర కౌశిక డ్రైన్‌పై ఉన్న వంతెన సోమవారం కురిసిన భారీ వర్షానికి కూలిపోయింది.

సర్పంచ్‌ కాండ్రేగుల గోపాలకృష్ణ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వంతెనను 1979లో డ్రైయినేజీ శాఖ నిర్మించింది. దాదాపు 40 ఏళ్ల పాటు ఈ రెండు గ్రామాల వారికే కాక ఎంతో మంది బాటసారులకు, రైతులకు ఉపయోగపడింది. వంతెన కూలడంతో రాకపోకలు స్తంభించాయి. కూలిన సమయంలో వంతెనపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రభుత్వం కుప్పకూలిన వంతెన స్థానంలో కొత్త వంతెనను సత్వరం నిర్మించాలని గ్రామస్తులు కోరారు.

మరిన్ని వార్తలు