అవగాహనతోనే బంగారు భవిష్యత్ రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి కార్యదర్శి వెంకటేశ్వర్లు

14 Aug, 2013 04:22 IST|Sakshi

  గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : బాధ్యతల నిర్వహణపై అవగాహనే విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు రాచబాట వేస్తుందని రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి కార్యదర్శి డి.వెంకటేశ్వర్లు అన్నారు.  గుడ్లవల్లేరు ఏఏఎన్‌ఎమ్ అండ్ వీవీఆర్‌ఎస్‌ఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా శాఖ  నిర్వహించిన వల్లూరుపల్లి వెంకట రామ శేషాద్రిరావు స్మారక అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని  ప్రసంగించారు.  ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి తన సొంత ఆలోచనలు, ఆశలు, కలలకు అనుగుణంగానే ఆ పని చేయటానికి ఇష్టపడతాడన్నారు.  ఆ కలల్ని నెరవేర్చుకునే విధంగా తన ప్రతిభా పాటవాలను నిరంతర కృషితో పదును పెట్టుకుంటే ప్రతి విద్యార్థి  విజేతగానిలుస్తాడని తెలిపారు.  
 
 రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రదానం...
  రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలోని అన్ని బ్రాంచీల్లో రాష్ట్రస్థాయి ప్రప్రథములుగా నిలిచిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని సాంకేతిక విద్యాశాఖ సంచాలకులు అధికారికంగా అందించే వల్లూరుపల్లి వెంకట రామ శేషాద్రిరావు స్మారక స్టేట్ అవార్డులను ఆయన ప్రదానం చేశారు. ఓవరాల్ స్టేట్ టాపర్‌గా నిలిచిన గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ ఈసీఈ విద్యార్థి బుడమ సాయితేజాకు రెండు బంగారు పతకాలు, 20వేల నగదు పారితోషికం, ప్రదానం చేశారు. రాష్ట్రంలోని ప్రైవేటు పాలిటెక్నిక్ విద్యార్ధుల అందరిలో స్టేట్ సెకండ్ టాపర్‌గా నిలిచిన ఎలక్ట్రికల్ విద్యార్థి షేక్ సుల్తాన్‌కు బంగారు పతకం, రూ.5వేల నగదు బహుమతి, ప్రశంసాపత్రాన్ని బహూకరించారు. ప్రిన్సిపాల్ ఎన్‌ఎస్‌ఎస్‌వీ రామాంజనేయులు అధ్యక్షతన సభ జరిగింది. విద్యార్థులు ప్రదర్శించిన స్వాగత, దేశభక్తి నృత్యాలు ఆహుతులను అలరించాయి. అనంతరం వెంకటేశ్వర్లకు ఘన సన్మానం చేశారు. విద్యాసంస్థల అధ్యక్షుడు వల్లభనేని సుబ్బారావు, కార్యదర్శి వల్లూరుపల్లి సత్యనారాయణరావు(బాబ్జి), సహ కార్యదర్శి వి.రామకృష్ణ, రిజిష్ట్రారు చుండ్రు వెంకట్రామన్న తదితరులు పాల్గొన్నారు.
 
 ఉద్యమం ఉధృతమైతే కష్టమే...
 సమైక్యాంధ్రా ఉద్యమం మరింత జఠిలమైతే పాలిటెక్నిక్ విద్యార్థులకు క్లాసులు నిర్వహించటం కష్టమవుతుందని వెంకటేశ్వర్లు చెప్పారు. విలేకరులతో మాట్లాడుతూ   ఉద్యమం తారాస్థాయికి చేరితే సిలబస్‌లో విద్యార్థులు వెనుకబడతారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 60 సెకండ్ షిప్ట్ పాలిటెక్నిక్ కాలేజీలుంటే, అందులో 24ప్రభుత్వ కాలేజీలే ఉన్నాయని చెప్పారు. చాలామేరకు ఈ కాలేజీలు మెరుగు పడాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
 
 
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా