బ్రిజేష్‌కుమార్ తీర్పు.. ఆంధ్రాకు అన్యాయం

24 Oct, 2016 19:20 IST|Sakshi
బ్రిజేష్‌కుమార్ తీర్పు.. ఆంధ్రాకు అన్యాయం
- సీఎం పట్టించుకోకపోవడం విడ్డూరం
- శాసనమండలి ప్రతిపక్షనేత రామచంద్రయ్య
ద్వారకానగర్ (విశాఖ): కృష్ణానదీ జలాల పంపకంపై బ్రిజేష్‌కుమార్ తీర్పుతో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరుగుతుందని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సి.రామచంద్రయ్య ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై సీఎం చంద్రబాబు పట్టనట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు.  సోమవారం నగరంలోని ఓ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నదీజలాల అన్యాయంపై చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నించకపోవడం విడ్డూరంగా ఉందని, కృష్ణాజలాల పంపకంలో ఆంధ్రాకు అన్యాయం జరగడానికి ముఖ్యమంత్రే కారణమని మండిపడ్డారు. చంద్రబాబు, కేసీఆర్ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు.
 
ఇప్పటికే రాయలసీమ నీటి ఎద్దడితో అలమటిస్తూంటే, కృష్ణాలోని 35 టీఎంసీల నీటిని మహారాష్ట్ర వంటి ఎగువ రాష్ట్రాలు వినియోగించుకుంటున్నాయని ఆరోపించారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు అడుగంటిపోతోందని, కృష్ణా డెల్టా కూడా ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. కృష్ణా నీళ్ల పంచాయితీని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకే పరిమితం చేస్తూ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ జలాలను నాలుగు రాష్ట్రాలకు సమానంగా పంచేలా చూడాలని రామచంద్రయ్య కోరారు. చంద్రబాబు చేపట్టిన ప్రాజెక్టులన్నీ కమీషన్ల కోసమేనని, ప్రధానమైన పోలవరం వదిలేసి, పట్టిసీమ, పురుషోత్తపురం ప్రాజెక్టులు చేపట్టడం కాసుల ఆకాంక్షేనని ఆరోపించారు.
 
చంద్రబాబు అనుకూల మీడియా ఎంత ప్రచార ఆర్భాటాలు చేపట్టినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన రూ. 60 వేల కోట్ల అప్పుకు వడ్డీ ఎలా కడతారని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి రాజధానిపై పదేళ్ల వరకు ఆంధ్రాకు హక్కు ఉన్నా సచివాలయాన్ని తెలంగాణాకు అప్పగిస్తామని సీఎం చెబుతున్నారని, ఇష్టానుసారం అప్పగించడానికి అదేమీ హెరిటేజ్ ఆస్తి కాదని రామచంద్రయ్య ఎద్దేవా   చేశారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు బోలిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు