విచారణాంశాలపై నేడు నిర్ణయం

7 Jul, 2017 01:06 IST|Sakshi
విచారణాంశాలపై నేడు నిర్ణయం

కృష్ణా జలాల వివాదంపై బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌లో వాదనలు
- నీటి అవసరాన్ని శాస్త్రీయంగా నిర్ధారించాలన్న తెలంగాణ
- కొరత ఉన్నప్పుడు ప్రాజెక్టుల వారీ కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి
- ఈ తరహా పంపకాలకు తాము సిద్ధమన్న ఏపీ
- ప్రాజెక్టుల వారీ కేటాయింపులపై వివరణ ఇవ్వాలన్న ట్రిబ్యునల్‌


సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల కేటాయింపులకు సంబంధించిన విచారణాంశాలను ట్రిబ్యునల్‌ శుక్రవారం నిర్ణయించనుంది. ముసాయిదాలోని అంశాలపై ఇప్పటికే బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌కు వివరణ సమర్పించిన ఇరు రాష్ట్రాలు.. గురువారం సుదీర్ఘంగా వాదనలు వినిపించాయి. ఏపీ ప్రభుత్వం తరఫున ఎ.కె.గంగూలీ, తెలంగాణ తరఫున వైద్యనాథన్‌ వాదించారు. నీటి లభ్యత తక్కువ ఉన్న సమయాల్లో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను ట్రిబ్యునలే నిర్ణయించాలని, ప్రాజెక్టులవారీ కేటాయింపులు చేసేటప్పుడు బేసిన్‌లోని ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని, పక్క బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో అధిక నీటి వినియోగాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ కోరింది.

మొత్తం నీటి లభ్యత, బేసిన్‌లోని అవసరాల కోసం ఒక్కో ప్రాజెక్టుకు ఎంత నీరు అవసరమనేది నిర్ధారించేందుకు పంటల సాగు పద్ధతి, పంట సమయం, ఎంత నీరు అవసరమో శాస్త్రీయంగా అంచనా వేయాలని విజ్ఞప్తి చేసింది. ఇక మహారాష్ట్ర, కర్ణాటకలలో ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు అవసరం లేదని.. ఏపీ, తెలంగాణల్లోని ప్రాజెక్టులకు మాత్రం అలా కేటాయించాలని, నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ప్రాజెక్టుల వారీగా నీటి విడుదలకు ప్రోటోకాల్‌ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కోరింది. ఈ క్రమంలో ట్రిబ్యునల్‌ కల్పించుకుని... రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టంలోని సెక్షన్‌–89లో పేర్కొన్న ‘ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు’అంశంపై వివరణ ఇవ్వాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. ఈ అంశంపై విచారణ జరపడానికి ప్రాథమికంగా అంగీకరించింది.

అలాగైతే వారికీ ఇవ్వొద్దు..
ఇక తెలంగాణలో కృష్ణా బేసిన్‌ పరిధిలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలకు, ఖనిజ నిల్వలున్న ప్రాంతాలకు సాగునీటిని కేటాయించకూడదని ఏపీ ప్రభుత్వం వాదించగా.. దీనిని తెలంగాణ తప్పుబట్టింది. ఏపీ నూతన రాజధాని కోసం 33 వేల ఎకరాల పంట భూములను సేకరించినందున అక్కడ ప్రస్తుతం పంటలు సాగు చేసే పరిస్థితి లేదని.. మరి ఆ ప్రాంతానికి కూడా సాగునీరు ఇవ్వకూడదని పేర్కొంది.

దీనిపై ఏపీ అభ్యంతరం తెలుపుతూ.. రాజధాని నిర్మాణంతో నీటి పంపకాల అంశాన్ని ముడిపెట్టవద్దని వ్యాఖ్యానించింది. మొత్తంగా ఇరు రాష్ట్రాల వాదనలు విన్న ట్రిబ్యునల్‌... రెండు రాష్ట్రాలు సమర్పించిన ముసాయిదాల్లో ఏ అంశాలను విచారించాలన్న దానిపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

>
మరిన్ని వార్తలు