రైతుల గుండెలపై నిలబడి రాజధాని నిర్మాణమా?

20 Jan, 2015 03:37 IST|Sakshi
రైతుల గుండెలపై నిలబడి రాజధాని నిర్మాణమా?

* చంద్రబాబుకు బృందా కారత్ సూటి ప్రశ్న
* రైతులకు పరిహారాన్ని ఎగ్గొట్టేందుకే భూసేకరణ ఆర్డినెన్స్‌పై నోరు మెదపలేదు
* ప్రత్యేక ప్యాకేజీపై ప్రజలు బాబును నిలదీయాలి..
* ‘సాక్షి’తో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు

 
సాక్షి, హైదరాబాద్: ‘రైతుల గుండెల మీద నిలబడి రాజధాని నిర్మిస్తారా?’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. బాబు తన సిద్ధాంతాలను తానే గాలికొదిలి పచ్చి రాజకీయ అవకాశవాదిగా మారారని, కేంద్రంతో మిలాఖత్ అయ్యారని దుయ్యబట్టారు. రైతుల నడ్డివిరిచేలా కేంద్రం భూ సేకరణ చట్ట సవరణపై ఆర్డినెన్స్ తెచ్చినా నోరు మెదపలేదని విమర్శించారు. రాష్ట్ర రాజధాని కోసం భూమిని సేకరిస్తున్నారని, ఆ భూమినే నమ్ముకున్న రైతులకు పరిహారాన్ని ఎగ్గొట్టేందుకే బాబు నోరు కుట్టేసుకున్నారని స్పష్టం చేశారు.
 
  సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు  ఇక్కడికి వచ్చిన ఆమె సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు. చంద్రబాబు చెబుతున్న అభివృద్ధి నమూనా దారుణాతి దారుణమైనదని పేర్కొన్నారు.  ‘నేను చంద్రబాబును మూడు ప్రశ్నలడగదలచుకున్నా.. కేంద్ర ఆర్డినెన్స్‌పై నోరెందుకు మెదపలేదో చెప్పాలి. రెండోది.. సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కుల్ని హరించేలా కేంద్రం సవరణలు చేసింది. దీనిపై మీ వైఖరేమిటో స్పష్టం చేయాలి.

ఏపీ రాజధాని నిర్మాణం కోసం మీరు సింగపూర్, జపాన్, మలేసియా అంటూ అక్కడ ఇక్కడ తిరుగుతున్నారు. రాజధానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ చౌకగా దొరుకుతున్న కార్మిక శక్తిని అమ్మదలచుకున్నారా? రెతుల నడ్డి విరిచి నగరాల్ని నిర్మిస్తారా? సింగపూర్ నమూనా ఇక్కడెలా సాధ్యపడుతుంది? ఇక మూడో ప్రశ్న ఆదివాసీలకు సంబం దించింది.. పోలవరం ప్రాజెక్టును ఎవరి పొట్టగొట్టి నిర్మించాలనుకుంటున్నారు? ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని పార్లమెంటు సాక్షిగా కేంద్రం ప్రకటించింది. అది ఎందుకు రాలేదో బాబు చెప్పాలి. ప్రజలూ నిలదీయాలి’ అని బృందా కారత్ అన్నారు.

>
మరిన్ని వార్తలు