దిశానిర్దేశం

28 Jun, 2015 02:31 IST|Sakshi
దిశానిర్దేశం

- అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి
- ఆరోపణలు తిప్పికొట్టండి
- టీడీపీ విస్తృత సమావేశంలో పార్టీశ్రేణులకు చంద్రబాబు పిలుపు
- క్రమశిక్షణపై నేతలకు క్లాస్
సాక్షి, విజయవాడ :
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నగరంలోని శేషసాయి కల్యాణ మండపంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9  గంటల వరకు టీడీపీ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, పార్టీ ఎన్నికల కన్వీనర్ కళావెంకట్రావు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తదితర నేతలు ప్రసంగించారు. గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు కమిటీలు, అనుబంధ కమిటీల ఏర్పాటు, ప్రజాప్రతినిధులు, పార్టీ మధ్య సమన్వయం, సంస్థాగత కమిటీలకు శిక్షణ-కార్యాచరణ ప్రణాళిక, కార్యకర్తల సంక్షేమం, రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, ఏడు మిషన్లు - ఐదు గ్రిడ్లు - ఐదు క్యాంపెయిన్లు, సంక్షేమ కార్యక్రమాలు, పింఛన్లు, డ్వాక్రా రైతు రుణమాఫీ తదితర 15 అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా సెక్షన్-8 అమలుపై ప్రజల్లో చర్చ తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. కొంతమంది కావాలని బురద జల్లుతున్నారని, సమర్థవంతంగా తిప్పికొట్టాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. ఇక నుంచి తాను విజయవాడలోనే ఎక్కువగా ఉంటానని, బస్సులోనే నిద్రపోతానని, ఇక్కడి నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తానని వివరించారు.
 
నాయకులకు క్లాస్

ఉదయం 10.45 గంటలకు సీఎం ప్రసంగం ప్రారంభం కాగా, సమావేశ మందిరంలో సగం కుర్చీలు ఖాళీగా కనిపించాయి. దీంతో ఆగ్రహించిన చంద్రబాబు క్రమశిక్షణ నేర్చుకోవాలంటూ నాయకులకు క్లాస్ తీసుకున్నారు.

ఎంపీ కేశినేనికి అభినందనలు
టాటా ట్రస్టు ద్వారా 264 గ్రామాల్లో సూక్ష్మ ప్రణాళిక తయారు చేయడం, రైతులకు లాభదాయకమైన వెదురు చెట్ల పెంపకంపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) చేపట్టడం అభినందనీయమని, మిగిలిన నేతలు అదే తరహాలో పనిచేయాలని సూచించారు.
 
నిరాశగా వెనుదిరిగిన లంబాడీలు
ఎ.కొండూరుకు చెందిన సుమారు 70 మంది లంబాడీలు ముఖ్యమంత్రిని కలిసేందుకు ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. తమ ఆధీనంలో ఉన్న అటవీ భూములకు పట్టాలు ఇప్పించాలని కోరేందుకు వచ్చారు. అయితే, వారిని కనీసం ప్రాంగణం లోపలకు కూడా రానీయకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో నిరాశతో వెనుదిరిగారు. 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ నిరుద్యోగులు సీఎంను కలిసి తమకు ఉద్యోగాలు ఇప్పించాలని వినతిపత్రం ఇచ్చారు.
 
హెల్త్ కార్డుల పంపిణీ
రాత్రి 9 గంటలకు సీఎం జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు పంపిణీ చేశారు. వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఇళ్ల స్థలాలను ఇప్పించాలని జర్నలిస్టులు కోరగా, మీ మేనేజ్‌మెంట్‌ను కోరాలని సూచించారు. ఎమ్మెల్సీ  బుద్దా వెంకన్న కూరగాయల గజమాలతో చంద్రబాబును సత్కరించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా