క్వారంటైన్‌లో సౌకర్యాలు.. ఇంట్లో కూడా ఉండవు

18 Apr, 2020 03:51 IST|Sakshi
తిరుచానూరు క్వారంటైన్‌లో వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న క్లైవ్‌ కుల్లీ

‘సాక్షి’తో బ్రిటన్‌ ప్రొఫెసర్‌ క్లైవ్‌ కుల్లీ 

స్టార్‌ హోటళ్లను తలపించేలా క్వారంటైన్‌ కేంద్రాలు

విదేశాల్లోనూ ఇలాంటివి చూడలేదు

వైద్య సిబ్బంది, అధికారుల ఆప్యాయతను మరువలేను

మధుర స్మృతులతో మా దేశానికి తిరిగి వెళ్తున్నా..  

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఓ బ్రిటన్‌ ప్రొఫెసర్‌ అనూహ్యంగా లాక్‌డౌన్‌తో భారత్‌లో చిక్కుకుపోయారు. విధిలేని పరిస్థితిల్లో భగవంతుడిపైనే భారం వేశారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతీ నిలయంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రంలో 22 రోజులపాటు గడిపారు. అనంతరం నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగిటివ్‌గా తేలడంతో బ్రిటన్‌ వెళ్లేందుకు అనుమతి లభించింది. క్వారంటైన్‌లో ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు, వైద్య సేవలు, తన అనుభవాలను ప్రొఫెసర్‌ క్లైవ్‌ కుల్లీ ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... 

► నా స్వస్థలం యూకేలోని బేబింగ్‌టన్‌ అనే చిన్న పట్టణం. వృత్తి రీత్యా జాగ్రఫీ ప్రొఫెసర్‌ని. విదేశాలను సందర్శించడం నా హాబీ. ప్రధాన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, విదేశాల సంస్కృతిని ప్రత్యక్షంగా గమనిస్తుంటా. తిరుమల శ్రీవారి దేవాలయాన్ని చూడాలనిపించి భారత్‌కు వచ్చా. 

► మార్చి 23న తిరుపతి చేరుకున్న మరుసటిరోజే భారత్‌లో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో నన్ను క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. అక్కడ 22 రోజులు ఉన్నా. నేను ఊహించిన దానికి, క్వారంటైన్‌లో పరిస్థితికి ఎంతో వ్యత్యాసం వుంది. విదేశాల్లో కూడా ఈ సౌకర్యాలను చూడలేదు. స్టార్‌ హోటల్స్‌ను తలపించేలా క్వారంటైన్‌లో వసతి సౌకర్యాలు ఉన్నాయి. 
క్వారంటైన్‌లో సౌకర్యాలు, వైద్య సేవలు ఎంతో బాగున్నాయని  క్లైవ్‌ కుల్లీ రాసిన లేఖ 

► వైద్య సిబ్బంది సేవలు, అధికారుల ప్రేమానురాగాల మధుర స్మతులతో స్వదేశానికి తిరిగి వెళ్తున్నా. వారి సేవ, ఆప్యాయత తలచుకుంటే కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేవరకు నిత్యం ప్రతి 30 నిమిషాలకు ఒకసారి నా గదికి వచ్చి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. సిబ్బంది ప్రవర్తన, ప్రేమ మరువలేనివి. రక్త సంబంధీకులు కూడా ఇంత సేవ చేయలేరు. వారికి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. మరోసారి భారత్‌కు వచ్చినప్పుడు వారిని తప్పకుండా కలుస్తా.  

► క్వారంటైన్‌ కేంద్రంలో నాణ్యమైన ఆహారంతోపాటు హాట్‌వాటర్, టీ, కాఫీ, కంపెనీ వాటర్‌ బాటిల్స్‌ అందించారు. నిత్యం గదిని శానిటైజర్స్‌తో శుభ్రపరుస్తూ దుప్పట్లు, టవళ్లు మార్చారు. తాజా కూరగాయలతో వండిన ఆహారం, పలు రకాల పండ్లు అందించారు. రోజుకు రెండుసార్లు స్నాక్స్, బిస్కెట్లు ఇచ్చారు. వైద్యులు సూచించిన పౌష్టికాహారాన్ని గది వద్దే అందించారు.  

► క్వారంటైన్‌లో ఉండేవారి కోసం వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశారు. ఏ అవసరం వచ్చినా మెసేజ్‌ చేస్తే సిబ్బంది వెంటనే వచ్చేవారు. 

► క్వారంటైన్‌ కేంద్రంలో అందించే సౌకర్యాలు మన ఇంట్లో కూడా ఉండవు. ఒకసారి ఇక్కడకు వచ్చాక తిరిగి ఇంటికి వెళ్లాలన్నా సంకోచిస్తారు. అనుమానితులు క్వారంటైన్‌కు స్వచ్ఛందంగా వెళ్లి అధికారులకు సహకరించండి. 

► రెండు సార్లు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగిటివ్‌గా రావడంతో నన్ను డిశ్చార్జి చేసి రూ.2 వేలు నగదు ఇచ్చారు. ట్రీట్‌మెంట్, మంచి వసతి సౌకర్యాలు కల్పించి నగదు సాయం చేయడం అభినందనీయం.  

► శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి బ్రిటన్‌ వెళ్లేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. అందులో ప్రయాణించేందుకు క్వారంటైన్‌ కేంద్రం అధికారులు నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ జారీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మా స్వస్థలానికి వెళ్తున్నా... బై..బై... 

మరిన్ని వార్తలు