డొంక కదులుతోంది

11 Oct, 2019 13:29 IST|Sakshi
భూ మాయలో సస్పెండ్‌ అయిన అమలాపురం రూరల్‌ మండలం కామనగరువు వీఆర్వో ప్రశాంత్‌కుమార్‌

లేని భూములకు నకిలీ రికార్డులపై మొదలైన చర్యలు

వీఆర్వో ప్రశాంత్‌కుమార్‌ సస్పెన్షన్‌

ఎస్‌డీసీ జ్ఞానాంబకు షాకాజ్‌ నోటీసు

కంప్యూటర్‌ ఆపరేటర్‌పై క్రిమినల్‌ కేసు

హెచ్‌డీఎఫ్‌సీ హెడ్‌ క్వార్టర్స్‌కు లేఖ

డాక్యుమెంట్ల కోసం ముంబయ్‌కి..

అమలాపురం టౌన్‌: లేని భూములకు నకిలీ రికార్డులు సృష్టించి బ్యాంక్‌ నుంచి రూ.1.50 కోట్ల రుణాన్ని కాజేసిన ఘటనపై జిల్లా కలెక్టర్‌ మురళీధరరెడ్డి చర్యలకు ఉపక్రమించారు. దీంతో ఈ భూ మాయజాలంపై డొంక కదులుతోంది. ప్రాథమికంగా ఈ తప్పిదానికి బాధ్యులని భావిస్తున్న సూత్రధారి అమలాపురం రూరల్‌ మండలం కామనగరువు వీఆర్వో ప్రశాంత్‌ కుమార్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ టోకరా వెలుగు చూసినప్పటి నుంచి ఆ వీఆర్వో అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. లేని 53 ఎకరాలకు అధికారికంగా ధ్రువీకరిస్తూ పత్రాలు జారీ చేసిన అప్పటి అమలాపురం తహసీల్దార్, ప్రస్తుతం కాకినాడ కలెక్టరేట్‌లో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న బేబీ జ్ఞానాంబకు వారం రోజుల్లో దీనిపై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశిస్తూ షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఇక అమలాపురం తహసీల్దార్‌ కార్యాలయంలో భూమి రికార్డులను కంప్యూటర్‌లో నకిలీ పత్రాలను తయారు చేసిన కంప్యూటర్‌ ఆపరేటర్‌ వంశీపై క్రిమినల్‌ కేసు పెట్టాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్‌ నుంచి గురువారం ఉత్వర్వులు జారీ అయ్యాయి. ఒక పథకం ప్రకారం జరిగిన ఈ భూ మాయలో భారీ రుణం ఇచ్చిన అమలాపురం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అధికారుల పాత్రపైనా జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు దృష్టి పెట్టి పలు కోణాల్లో విచారణ చేపడుతున్నారు.

తొలుత ఆ బ్యాంక్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు ఇక్కడ జరిగిన పరిణామాలపై లేఖ రాయాలని జిల్లా కలెక్టర్‌ అమలాపురం ఆర్డీవోను ఆదేశించారు. బ్యాంక్‌కు నకిలీ పత్రాలు సమర్పించిన అసలు సూత్రధారి ఉప్పలగుప్తానికి చెందిన మోటూరి బలరామమూర్తికి ఒకేసారి రూ.1.50 కోట్ల రుణం ఇలా ఇచ్చారనే కోణంలో కూడా బ్యాంక్‌ ఉన్నతాధికారుల నుంచి సమాచారం సేకరించే పనిలో రెవెన్యూ అధికారులు ఉన్నారు. అలాగే నకిలీ పత్రాలతో అడ్డగోలుగా అంతటి రుణాన్ని ఇచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ  అమలాపురం శాఖపై విచారణ జరపాలని జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ షణ్ముఖరావును జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి ఆదేశించారు. దీనిపై షణ్ముఖరావు ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అధికారులతో మాట్లాడారు. నకిలీ పత్రాలతో రుణం ఇచ్చిన డాక్యుమెంట్లను తమకు చూపించాలని కోరారు. అయితే ఆ డాక్యుమెంట్లు తమ హెడ్‌ క్వార్టర్‌ ముంబైలో ఉన్నాయని బ్యాంక్‌ అధికారులు బదులిచ్చారు. తక్షణమే వాటిని ఇక్కడికి రప్పించాలని ఆయన చెప్పడంతో ముంబై నుంచి వాటిని రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక లేని భూములకు కళ్లు మూసుకుని ఈసీ, తనఖా రిజిస్ట్రేషన్‌ చేసిన అమలాపురం రిజిస్ట్రార్‌ కార్యాలయం సిబ్బందిపైనా జిల్లా రెవెన్యూ అధికారులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రార్‌ ఉన్నతాధికారులు కూడా ఈ భూ మాయపై చాపకింద నీరులా విచారణ చేస్తున్నారు. ఇలా పలు కోణాల్లో జిల్లా రెవెన్యూ అధికారులు ఈ నకిలీ భూమి రికార్డుల మోసాలపై ఉచ్చు బిగిస్తూ బాధ్యులపై చర్య తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు