బ్రాయిలర్ చేపలు వచ్చేస్తున్నాయ్..

29 Apr, 2015 09:33 IST|Sakshi
బ్రాయిలర్ చేపలు వచ్చేస్తున్నాయ్..

సాక్షి, బ్యూరో: బ్రాయిలర్ చేపలు వచ్చేస్తున్నాయ్. అదేంటి బాయిలర్ కోళ్లు గురించి విన్నాం.. బ్రాయిలర్ చేపలు అంటున్నారేంటని విస్తుపోకండి. మీరు చదువుతున్నది నిజమే. మాంసాహార ఉత్పత్తిలో ప్రయోగాలు కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో బ్రాయిలర్ కోడి మాదిరిగా రాష్ట్రంలోని మాంసాహార ప్రియులకు చేపలు అందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మత్స్య శాస్త్రవేతల మదిలో మెదిలింది. ఆఫ్రికన్ దేశాల్లో లభించే తిలాఫియా జాతికి చెందిన చేపలపై చేసిన ప్రయోగాలు ఫలించడంతో ఏపీలో సాగుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 13 జిల్లాల్లో 2,500 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా  సాగు చేసేందుకు మత్స్యశాఖ చర్యలు చేపట్టింది. ఒకటి రెండు చోట్ల మాత్రమే అందుబాటులో ఉన్న హేచరీల నుంచి తిలాఫియా చేప పిల్లల్ని పెంచనున్నారు. గుడ్డు నుంచి పిల్లగా మారిన రోజు నుంచే ప్రత్యేకంగా హార్మోన్లతో కూడిన మేత అందించడంతో తిలాఫియా ఆడ చేపలు సైతం మగ చేపలుగా మారిపోతాయి. దీంతో పునరుత్పిత్తి అవకాశంలేనిరీతిలో పెరుగుతాయి. వాటిని ప్రత్యేకంగా మాంసం కోసమే వినియోగిస్తారు. దీన్ని ముల్లు, చర్మం తొలగించి విక్రయిస్తే లాభాల పంట పండుతుంది. ఇది మంచి మాంసాహారం కావడంతో దేశీయ మార్కెట్లోను గిరాకీ ఉంటుందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. రోగాలను, కాలుష్యాన్ని తట్టుకుని ఎలాగైనా బతికే మొండిజాతి చేప కావడంతో తక్కువ సమయంలోనే 750 గ్రాముల వరకు పెరుగుతుంది. ఒక ముల్లు(మిడిల్ బోన్) మాత్రమే ఉండే తిలాఫియా చేపల మాంసం రుచిగా ఉంటుంది.

మరిన్ని వార్తలు