పేదింటికి పుట్టెడు కష్టం

18 Jul, 2018 12:46 IST|Sakshi
దివ్యాంగులు అమ్ములు, రాజేష్‌ వద్ద తండ్రి శేఖర్‌

కాళ్లు, చేతులు చచ్చుబడి నడవలేని అక్కాతమ్ముడు

దివ్యాంగుల పింఛన్ల కోసం పాట్లు

దొరవారిసత్రం: చిన్నారుల ఆటపాటలు, సరదాలతో ఆనందంగా గడపాల్సిన కుటుంబం పుట్టెడు కష్టంతో విలవిల్లాడుతోంది. శారీరక, మానసిక ఎదుగుదల లేకుండా జన్మించిన ఇద్దరు పిల్లలను చూసి తల్లిదండ్రులు పడుతున్న వేదన అంతుపట్టలేకుండా ఉంది. మెరుగైన చికిత్సను అందించే స్తోమత సైతం లేకపోవడంతో కుటుంబం అంతులేని ఆవేదనకు గురవుతోంది. దొరవారిసత్రం మండలం తీర గ్రామమైన మీజూరు పంచాయతీ పరిధిలో గల కారికాడు ఎస్సీ కాలనీకి చెందిన కొమ్మక శేఖర్, వసంతమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు అమ్ములు(13), శ్రీమంజుల(11), రాజేష్‌(09). వీరిలో అమ్ములు, రాజేష్‌ పుట్టిన ఏడాది నుంచే కాళ్లు, చేతులు చచ్చుబడి నడవలేకపోయారు.

పిల్లల ఆలనాపాలనకే తండ్రి
పిల్లవాడికైతే మాట కూడా సక్రమంగా రాదు. అప్పట్లో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం అందించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. వయస్సు పెరిగినా, శారీరకంగా ఇద్దరి పిల్లల్లో ఎదుగుదల్లేదు. ఇద్దరు పిల్లలకు ఎవరో ఒకరి సాయం లేనిదే ఏమీ చేయలేని పరిస్థితి. కుటుంబ పరిస్థితి బాగొలేకపోవడంతో తడ ప్రాంతంలోని అపాచీ కంపెనీలో తల్లి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. తండ్రి మాత్రం ఇంటి వద్దే ఉండి పిల్లల ఆలనాపాలనా చూసుకుంటున్నారు. అమ్ములు ఐదో తరగతి వరకు స్థానిక ప్రాథమిక పాఠశాలలోనే తండ్రి సాయంతో చదివింది. ఉన్నత విద్యకు బయట పాఠశాలకు పంపలేని పరిస్థితి. రాజేష్‌కు నోటి మాట కూడా సక్రమంగా రాకపోవడంతో పాఠశాలకు పంపలేదు.

పింఛన్‌ మంజూరులో అన్యాయం
దివ్యాంగులైన అమ్ములు, రాజేష్‌కు 100 శాతం వికలత్వ సర్టిఫికెట్‌ ఉన్నా, ప్రభుత్వం నుంచి పింఛన్‌ అందడంలేదు. పింఛన్‌ కోసం మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు తండ్రి ఏడేళ్లుగా తిరుగుతున్నా, ప్రయోజనం శూన్యమవుతోంది. గతేడాది రేషన్‌ కార్డులో పిల్లలను నమోదు చేసుకుంటే పింఛన్‌ వస్తుందని అధికారులు సూచించారు. పలుచోట్ల తిరిగి రేషన్‌కార్డులో పేర్లు నమోదు చేయించి పింఛన్‌ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం మాత్రం కానరాలేదు. తాజాగా ప్రజాసాధికారిక సర్వేలో పిల్లల పేర్లు లేవని, ఈ క్రమంలోనే దివ్యాంగుల పింఛన్‌ రావడంలేదని మండలాధికారులు తెలిపారు. ప్రజాసాధికారిక సర్వేలో పిల్లల పేర్ల నమోదుకు కొన్ని రోజులు నుంచి తిరుగుతూనే ఉన్నా అధికారులు మాత్రం కనికరం చూపడంలేదు. పింఛనైనా వస్తే పిల్లలకు మంచి ఆహారాన్ని అందించవచ్చనే ఆశతో తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వార్తలు