మృత్యోన్మాదం

25 Dec, 2015 01:07 IST|Sakshi

కోరుకొండలో దారుణం
 ఇనుపరాడ్డుతో ఉన్మాది దాడి
 ఘటనా స్థలిలో ఇద్దరు.. చికిత్స పొందుతూ మరొకరు మృతి
 
 కోరుకొండ /రాజమండ్రి క్రైం : ప్రశాంతంగా ఉన్న కోరుకొండలోని రామచంద్రరావు పేట ఒక్కసారిగా ఉలిక్కి పడింది. క్రిస్మస్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు స్థానికులు సన్నద్ధమవుతున్నారు. ఇంతలో ఓ ఉన్మాది ఇనుపరాడ్డుతో దాడి చేసి ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాడు. తల్లి లాంటి వదినను కొట్టి చంపాడు.  అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరిని కూడా అంతమొం దించాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతం ఒక్కసారిగా భీతా వహంగా మారింది. ఇద్దరు ఘటనా స్థలిలోనే మృతి చెందగా, మరో మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
 
  స్థానిక రామచంద్రరావు పేటకు చెందిన ఏడిద ఆనంద్ గతంలో ఓ హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం మతిస్థిమితం లేని అతడు వివిధ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఇంటి వద్ద పని చేసుకుంటున్న వదిన విజయలక్ష్మి (45)తో ఘర్షణ దిగాడు. ఇనుప రాడ్డుతో ఆమె తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది.  ఆ సమయంలో ఇంటి పక్కనున్న గెడ్డం నాగభూషణం (40) వచ్చి ప్రశ్నించడంతో అతడిని కూడా తీవ్రంగా గాయపరిచాడు. నాగభూషణాన్ని స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెం దాడు.
 
  ఇంటి వద్ద పని చేసుకుంటున్న కోరుకొండ-2 ఎంపీటీసీ (టీడీపీ) సభ్యురాలు ఖండవల్లి కుమారి (45) గొడవను చూసి కేకలు వేసింది. అప్పటికే ఇద్దరిపై దాడి చేసిన అతడు కుమారి వద్దకు వచ్చి రాడ్డుతో తలపై తీవ్రంగా గాయపరిచాడు. తీవ్రగాయాలైన ఆమెను భర్త పంతులు, బంధువులు కలసి కోరుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుమారికి భర్త, కుమార్తె ఉన్నారు. డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్, సీఐ జి.మధుసూదనరావు, ఎస్సై డి.రాంబాబు, సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఏడిద ఆనంద్‌ను కోరుకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృ తురాలు విజయలక్ష్మికి భర్త, కుమార్తె ఉన్నారు. అలాగే నాగభూషణానికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
 
 సకాలంలోరాని 108 అంబులెన్సు
 ప్రాణాపాయాలతో కొట్టుమిట్టులాడుతున్న గెడ్డం భూషణం, ఖండవల్లి కుమారిలను ఆస్పత్రికి తరలించేందుకు 108 అంబులెన్సు సకాలంలో రాకపోవడంతో ప్రాణాలు కోల్పోయారని పలువురు ఆరోపించారు.
 
 చికిత్స పొందుతూ ఎంపీటీసీ సభ్యురాలి మృతి
 కోరుకొండ గ్రామంలో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన ఎంపీటీసీ సభ్యురాలు ఖండవల్లి కుమారి తీవ్రగాయాలతో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. అదే ఘటనలో మృతి చెందిన ఏడిద విజయలక్ష్మి, గెడ్డం భూషణం మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చినప్పుడు  బంధువుల ఆక్రందనలతో ఆస్పత్రి ప్రాంగణం మార్మోగింది. క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకుందామనుకుంటున్న వేళ ఇలా మృత్యువాతపడడంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.
 
 జక్కంపూడి విజయలక్ష్మి పరామర్శ
 సంఘటన స్థలాన్ని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మితో పాటు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నాయకులు పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు.
 

మరిన్ని వార్తలు