బీఎస్‌–4.. రిజిస్ట్రేషన్ల జోరు

12 Mar, 2020 04:34 IST|Sakshi

రోజుకు సగటున 5 వేల వాహనాల రిజిస్ట్రేషన్‌

రెండు రోజులకే మారిపోతున్న సిరీస్‌

ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌–6 వాహనాలకే రిజిస్ట్రేషన్లు

బీఎస్‌–4 వాహనాల రిజిస్ట్రేషన్‌కు మార్చి 31 వరకే గడువు

సాక్షి, అమరావతి: బీఎస్‌–4 వాహనాల రిజిస్ట్రేషన్‌కు డెడ్‌ లైన్‌ దగ్గరపడుతుండటంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌–6 వాహనాలకే రిజిస్ట్రేషన్లు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీ రవాణా శాఖ వాహన డీలర్ల వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్లు చేయిస్తోంది. మొన్నటి వరకు రోజుకు సగటున 3–4 వేల వాహనాల రిజిస్ట్రేషన్లు జరగ్గా.. ఇప్పుడు 5 వేలకు పైగా జరుగుతున్నాయి. దీంతో రెండ్రోజులకే రిజిస్ట్రేషన్‌ సిరీస్‌ మారుతోంది. ఈ నెల రెండో వారం తరువాత ఈ రిజిస్ట్రేషన్ల సంఖ్య రోజుకు 10 వేల వరకు జరిగే అవకాశం ఉందని రవాణా శాఖ భావిస్తోంది. ఇందుకు తగ్గ ఏర్పాట్లు అన్ని రవాణా శాఖ కార్యాలయాల యూనిట్లలో చేశామని అధికారులు చెబుతున్నారు.

నేరుగా బీఎస్‌–6కు..
వాహన రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన దేశంలోనూ కాలుష్యం, రోడ్డు భద్రత, మెకానికల్‌ అంశాలకు సంబంధించి భారత్‌ స్టాండర్డ్స్‌ (బీఎస్‌) పేరిట నాణ్యత ప్రమాణాలను నిర్ణయించారు. 

► వీటిని బీఎస్‌–1, 2, 3, 4, 5, 6 కేటగిరీలుగా విభజించారు. ప్రస్తుతం బీఎస్‌–4 వాహనాల నుంచి బీఎస్‌–5 కాకుండా నేరుగా బీఎస్‌–6కు వెళ్లారు. బీఎస్‌లో ప్రధానంగా కాలుష్యంపైనే అత్యున్నతంగా ప్రమాణాలను నిర్దేశించారు. బీఎస్‌–6 వాహనాలు 68 శాతం కాలుష్య రహితంగా రూపొందించారు.

► అన్ని కంపెనీలకు బీఎస్‌–4 వాహనాల రిజిస్ట్రేషన్లు డీలర్ల వద్దే జరగనుండటంతో వీటిపై రవాణా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఏయే పేర్లతో వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ జరిగే వాహనదారులకు రెండో వాహనం ఉందా? అన్న అంశాలపై దృష్టి పెట్టారు. 

 రెండో వాహనం ఉంటే రిజిస్ట్రేషన్‌ చార్జీలు రెండింతలు చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ద్విచక్ర వాహనాలు సహా బీఎస్‌–6 వాహనాలకే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.

ఈ నేపథ్యంలో బీఎస్‌–4 వాహనాలకు కంపెనీలు ఆఫర్లు ప్రకటించాయి. రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ధరలను తగ్గించారు. 

►కొందరు డీలర్లు బీఎస్‌–4 వాహనాలను తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్‌ చేయించి ఏప్రిల్‌ తర్వాత ప్రీ ఓన్డ్‌ షోరూంలకు తరలించే ఆలోచన చేస్తున్నారని రవాణా అధికారులు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు