చదువుల తల్లికి కష్టమొచ్చింది!

5 Jun, 2019 11:47 IST|Sakshi
చదువుల తల్లి యమున బీఎస్సీ కంప్యూటర్స్‌లో తను తెచ్చుకున్న మార్కులు

అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతి సోదరి కష్టంపై ఆధారం

బీఎస్సీ కంప్యూటర్స్‌లో 9.91 జీపీఏ

ఉన్నత చదువులకు తప్పని ఆర్థిక ఇబ్బందులు

దాతలు ఆదుకుంటే భవితకు భరోసా

లక్షల్లో ఫీజులుకట్టి చదివించినా అందరు పిల్లలు మంచి ఫలితాలను సాధించరు. కానీ కొందరు మాత్రం ఎన్ని ఇబ్బందులున్నా అద్భుత ఫలితాలను తమ సొంతం చేసుకుంటారు. అలాంటి కోవకు చెందిందే యమున. మొన్నటి డిగ్రీ ఫలితాల్లో 9.91 జీపీఏతో మంచి మార్కులు తెచ్చుకుంది. అయితే ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు.  తల్లిదండ్రులు మృతిచెందారు. ముగ్గురు ఆడబిడ్డలే. ఓ సోదరికి వివాహమై భర్తతో ఉంది. మరో సోదరి కష్టంతో ఇప్పటిదాకా  చదివింది యమున. అయితే ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులు శాపంగా మారాయి.

పలమనేరు: రామకుప్పం మండలం కవ్వంపల్లెకు చెందిన యమున పాఠశాల స్థాయి నుంచే బాగా చదువుతోంది. వీకోట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ చదివి 920 మార్కులు సాధించింది. దీంతో వీకోటకు చెందిన నలంద డిగ్రీ కళాశాల యాజమాన్యం ఆ విద్యార్థికి కళాశాల ఫీజు లేకుండానే అడ్మిషన్‌ ఇచ్చారు. బీఎస్సీ కంప్యూటర్స్‌లో 9.91 మార్కులు సాధించి యూనివర్సిటీ టాపర్స్‌ జాబితాలో చోటుదక్కించుకుంది.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అవ్వాలనే లక్ష్యం
శిరీష ఎంసీఏ చేసి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావాలనే లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే కుటుంబ పరిస్థితులు, పేదరికం అవరోధంగా మారాయి. దీంతో ఇంటికే పరిమితమైంది. ఎంసీఏ చదివించేందుకు ఎవరైనా దాతలు స్పందిస్తే తన కలని సాకారం చేసుకుంటానంటోంది.

ఉన్నత చదువులకు తప్పని ఆర్థిక ఇబ్బందులు
యమున తండ్రి జయరామిరెడ్డి తొమ్మిదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయినా ఆయన భార్య నాగరత్నమ్మ  ముగ్గురు ఆడపిల్లలను కూలినాలి చేసి  పోషించింది. వీరికి రెండెకరాల మెట్టపొలం మినహా మరే ఆధారం లేదు. పెద్దకుమార్తెకు ఇన్ని కష్టాల నడుమే వివాహం చేసింది.. రెండో కుమార్తె శిరీష డిగ్రీదాకా చదివి ఆపై ఆర్థిక సమస్యలతో చదువుకు స్వస్తి పలకాల్సి వచ్చింది. 9నెలల క్రితం తల్లి నాగరత్నమ్మ సైతం అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో ఇంట్లో ఇరువురు ఆడపిల్లలు మాత్రం మిగిలారు. తన లక్ష్యాన్ని చెల్లెలు ద్వారా సాకారం చేసుకోవాలన్న సోదరి శిరీష పక్కనే ఉన్న చిన్నబల్దారు హైస్కూల్లో విద్యావలంటీర్‌గా పనిచేస్తూ కుటుంబానికి దిక్కుగా మారింది. అయితే అక్కడ వీవీలకిచ్చే వేతనం చాలక, అదీనూ నెలనెలా సక్రమంగా రాక ఇబ్బందులు తప్పలేదు. ఈ నేపథ్యంలో యమున ఉన్నత చదువులకు ఆర్థిక సమస్య వెంటాడుతోంది.

మరిన్ని వార్తలు