బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల ఆకస్మిక సమ్మె

29 Nov, 2013 05:53 IST|Sakshi

నిజామాబాద్‌సిటీ, న్యూస్‌లైన్ : బదిలీ అయిన ఉద్యోగుల బదిలీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ  బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌లో  సమ్మె చేపట్టారు.  ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈవీఎల్ నారాయణ  మాట్లాడుతూ సబ్ డివిజన్ ఇంజినీర్ విభాగంలో కేవలం 37 శాతం మంది ఉద్యోగులే పని చేస్తున్నారని చెప్పారు.

ఎల్లారెడ్డి,బోధన్,మోర్తాడ్,కిసాన్‌నగర్ సబ్ డివిజన్లకు ఇంజినీర్లు లేరన్నారు. అలాగే జిల్లాలో జేటీవోలు కేవలం 40 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఇక్కడ పని చేస్తున్న జేటీవోలు ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకుని వారి స్థానంలో మరొకరు రాకముందే  పైరవీలు చేసి రిలీవ్ అవుతున్నారని ఆరోపించారు. దీంతో జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్ అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. మార్కెటింగ్ విభాగంలో పని చేసే జేటీవోలను జీఎం కార్యాలయంలో ఉన్నతాధికారులు నియమించారన్నారు.

అక్కడ జేటీవోలతో చిన్న చిన్న పనులను చేయిస్తున్నారని,దీంతో కస్టమర్ కేర్ సెంటర్‌లలో అనేక పనులు పెండింగ్‌లో పడుతున్నాయన్నా రు.  సమ్మెలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశం,ఉపాధ్యక్షుడు మధుసూదన్,సహాయ కార్యదర్శి ఎంఎల్ నారాయణ,మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి,బ్రాంచ్ కార్యదర్శి రఘనందన్,నాయకులు గంగాధర్,బాల గంగయ్య,సాయిలు తదితరులు పాల్గొన్నారు.
 కస్టమర్ కేర్ సెంటర్ల మూసివేత..
 ఉద్యోగులు ఆకస్మాత్తుగా సమ్మె చేపట్టడంతో కస్టమర్ కేర్ సెంటర్లు మూసివేశారు. జిల్లా కేంద్రంలోని సెల్‌వన్ కార్యాలయం,వినాయక్‌నగర్,కంఠేశ్వర్‌లోని కస్టమర్ కేర్ సెంటర్‌లు మూసివేశారు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.   ఉద్యోగులు ఆకస్మాత్తుగా సమ్మెకు దిగడం పలు అనుమానాలు తావి స్తోంది.  సమ్మె, ధర్నాలు చేసేముందు ఉద్యోగులు త మ పైఅధికారులకు ముందస్తుగా నోటీసులు ఇవ్వాలి. కాని గురువారం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఆకస్మాత్తుగా ధర్నాకు దిగడంపై ఉన్నతాధికారులు వీరిపై చర్యలకు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.

>
మరిన్ని వార్తలు