సూపర్ న్యూమరరీ కోటా ఫీజు రూ.3.17 లక్షలు

13 Sep, 2013 02:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: సూపర్ న్యూమరరీ కోటా కింద బీటెక్, బీ.ఫార్మసీ, ఫార్మా-డీ, బీఆర్క్, ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందే విదేశీ విద్యార్థులు, భారత సంతతికి చెందిన వారు వార్షిక రుసుమును రూ. 3.17 లక్షలు(5 వేల డాలర్లు) చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అడ్మిషన్, ఫీజుల నియంత్రణ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు వార్షిక రుసుమును రూ. 1.90 లక్షలు(3వేల డాలర్లు)గా నిర్ధారించింది. ఎంటెక్, ఎం ఫార్మసీ, ఫార్మాడీ, ఎం ఆర్క్, ప్లానింగ్ కోర్సుల్లో వార్షిక రుసుమును రూ.3.81 లక్షలు(6 వేల డాలర్లు)గా ఖరారు చేసింది. అయితే, ఇదే కోటాలో అడ్మిషన్లు పొందే భారతీయ గల్ఫ్ కార్మికుల పిల్లలకు సాధారణ ఫీజులే వసూలు చేయనున్నట్టు పేర్కొంది.
 

20 నుంచి ఎంసెట్-ఏసీ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ముస్లిం మైనారిటీ విద్యార్థులకు బీటెక్, బీఫార్మసీ(ఎంపీసీ స్ట్రీమ్)లో ప్రవేశానికి ఈ నెల 20 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఎంసెట్-ఏసీ-సింగిల్‌విండో-2 కన్వీనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 20వ తేదీన 1 నుంచి 1,30,000 వరకు గల ర్యాంకర్లు, 21న 1,30,001 నుంచి 1,70,000 వరకు, 22న 1,70,001 నుంచి చివరి ర్యాంకు వరకు గల ముస్లిం మైనారిటీ అభ్యర్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. హైదరాబాద్, మార్కాపురం, విజయవాడ, కడప, నెల్లూరు పట్టణాల్లో కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. పూర్తివివరాలకు  వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
 
భారీగా తగ్గిన ఎంసీఏ, ఎంబీఏ సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ సంవత్సరం ఎంసీఏ, ఎంబీఏ సీట్లు భారీగా తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే ఎంబీఏ సీట్లు 15,450, ఎంసీఏ సీట్లు 24,400 తగ్గిపోయాయి. ఈ రెండు కోర్సులకు డిమాండ్ పడిపోవడంతో ఈ ఏడాది 130 ఎంబీఏ కాలేజీలు, 334 ఎంసీఏ కాలేజీలు కోర్సులను రద్దు చేశాయి. దీంతో ఈ ఏడాది 837 ఎంబీఏ కాలేజీల్లో 95,535 సీట్లు, 317 ఎంసీఏ కాలేజీల్లో 22,304 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఐసెట్‌లో మొత్తం 1,26,000 మంది అభ్యర్థులు క్వాలిఫై కాగా 1,19,647 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు