‘నీటి’ మీద రాతేనా!

6 Sep, 2019 09:57 IST|Sakshi
బకింగ్‌హాం కెనాల్‌ (పాతచిత్రం)

జలరవాణాకు కేంద్రం నీళ్లొదిలిందా..? ఇప్పటివరకూ చేసిన ప్రతిపాదనలన్నీ నీటి మీద రాతలేనా..? అంటే ప్రస్తుత పరిణామాలను బట్టి అవుననే సమాధానమే వస్తోంది. గతంలో దీనిపై సర్వే కూడా పూర్తిచేసిన అధికారులు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు.

సాక్షి, తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి): జలరవాణా మార్గం అభివృద్ధిని కేంద్రం పక్కన పెట్టేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది జలరవాణా కోసం జిల్లాలో కాలువల తవ్వకం జరగాల్సి ఉన్నా, ఆ  ఊసే లేకుండా పోయింది. దాదాపుగా రెండేళ్ల క్రితం దీని కోసం జిల్లాలో సర్వే సంస్థలు రెవెన్యూ అధికారులతో కలిసి సర్వే చేసి ఎక్కడెక్కడ ఎంత భూమి సేకరించాలో మార్కింగ్‌ ప్రక్రియను పూర్తిచేశాయి. కాకినాడ, చెన్నై మధ్య బకింగ్‌హాం కాలువ పరిధిలోని ఉప కాలువలను విస్తరించి, వంతెనలను కొన్నింటిని తొలగించి, మరికొన్నింటిని ఎత్తు పెంచి జలరవాణాను పునరుద్ధరించాలనేది కేంద్రం ఉద్దేశం.

2017 నవంబరు 29 నాటికే దీనికోసం సర్వే పూర్తయ్యింది. నివేదికలు అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి, జలవనరుల శాఖ ద్వారా సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సీడబ్ల్యూసీ)కి వెళ్లాయి. అయితే ఆ తర్వాత ఇంతవరకూ ఆ పనుల్లో కదలిక లేదు.  గతంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దీనిపై నానా హడావుడి చేసింది. జలరవాణాను పునరుద్ధరిస్తున్నట్టు ప్రచారం చేసింది. కానీ ఇప్పటివరకూ పురోగతి లేదు. జలరవాణా ఫైలు మూలకు చేరినట్టు ఆ శాఖ అధికారుల సమాచారం.

అవగాహన కార్యక్రమాలతో సరి!
జిల్లాలో ఏలూరు నుంచి విజ్జేశ్వరం వరకు ఎనిమిది మండలాలు, 37 గ్రామాల పరిధిలో జలరవాణా విస్తరణకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. కాలువల తవ్వకం, వెడల్పు కోసం 2547.13 ఎకరాల భూ సేకరణ చేయాలని తలంచారు.  ఐడీఎల్‌ ఏజెన్సీ ద్వారా పులిచింతల ప్రాజెక్టు డివిజన్‌ –02 అధికారుల పర్యవేక్షణలో  సర్వే కూడా పూర్తిచేశారు. ఏయే రైతుల భూమి సేకరించాల్సి ఉంటుంది? రైతులు ఎంత పరిహారం కోరుతున్నారు? వంటి అంశాలపై అవగాహనకు వచ్చారు.  ప్రభుత్వ భూములు మినహా. ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి 1550 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుందని అంచనావేశారు. రైతులతోనూ అవగాహన సదస్సులు నిర్వహించారు. కానీ ఆ తర్వాత ఎందుకో ఈ అంశం మరుగున పడింది.

భూసేకరణకు రూ.700 కోట్లు
జిల్లాలో కాలువల తవ్వకం, వెడల్పు కోసం భూసేకరణకు సుమారు రూ.700 కోట్లు అవసరమవుతాయని  అప్పట్లో అధికారులు అంచనావేశారు. రెవెన్యూ పరిధిలో ఉన్న భూములను జలరవాణా కోసం ఉచితంగా ఇవ్వడానికి అప్పట్లో ప్రభుత్వం ముందుకు వచ్చింది. 2018 మేలో కాలువల విస్తరణ పనులు ప్రారంభం కావాల్సి ఉన్నా, ఆ జాడ లేకుండా పోయింది. ఆరా తీస్తే జలరవాణాను కేంద్రం పక్కన పెట్టిందని, జలరవాణా ప్రతిపాదనలకు అప్పట్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వంతో తలెత్తిన వివాదాల నేపథ్యంలో కేంద్రం నిధులు లేవని చేతులెత్తేసిందని ప్రచారం జరిగింది.

ఆ పనుల ఊసేలేదు 
జాతీయ జలరవాణా పనుల గురించి ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలూ లేవు. గతంలో భూసేకరణ నిమిత్తం చేసిన మార్కింగ్‌ల తర్వాత ఏ పనీ జరుగలేదు. కొత్త ప్రభుత్వం మార్గదర్శకాలను ఇస్తే తదనంతర పనులపై దృష్టిసారిస్తాం.
– సత్యదేవ, ఇరిగేషన్‌ డీఈ, తాడేపల్లిగూడెం

మెరుగైన నిర్ణయం ఉంటుంది
జలరవాణాపై రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన నిర్ణయం తీసుకుంటుంది. ప్రతిపాదనలను మళ్లీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, అధికారులతో అధ్యయనం చేసి ఎలా ముందుకెళ్లాలో మార్గదర్శకాలు ఇస్తుంది.  
–  కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం

మరిన్ని వార్తలు