‘బకింగ్‌హాం’.. ఇక చక చక

22 Dec, 2014 02:23 IST|Sakshi
‘బకింగ్‌హాం’.. ఇక చక చక
  • మార్చిలో జల రవాణా పనులు
  •  మొదట పెదగంజాం నుంచి కృష్ణపట్నం వరకూ డ్రెడ్జింగ్
  •  500 టన్నుల సరుకు రవాణాకు వీలుగా కాలువ ఆధునీకరణ
  •  మంత్రి దేవినేనితో అంతర్గత జల రవాణా సీఈ భేటీ, చర్చలు
  • సాక్షి, విజయవాడ బ్యూరో: కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకూ ఉన్న బకింగ్‌హాం కెనాల్ ద్వారా జల రవాణాకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. వచ్చే మార్చిలో కాలువలో అవసరమైన చోట డ్రెడ్జింగ్ పనులు మొదలు పెట్టాలని అధికారులు నిర్ణ యం తీసుకున్నారు. కేంద్ర జల రవాణా చీఫ్ ఇంజనీర్ ఎస్.దండపత్ ఆదివారం విజయవాడలోని సాగునీటి శాఖ కార్యాలయంలో ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

    జల రవాణాకు అనుకూలంగా బకింగ్‌హాం కాలువలో కేంద్రం చేపట్టబోయే పనులపై చర్చించా రు. మొత్తం 500 టన్నుల మేర సరకు రవాణాకు అనుకూలంగా కాలువ మార్గాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందని దండపత్ వివరించారు. ఈలోగా నాలుగు దశల్లో కాల్వపై పూర్తి స్థాయి సర్వే నిర్వహిస్తామని, ఆపైన దశల వారీగా పను లు చేపడతామని చెప్పారు. మొత్తం 1,095 కిలోమీటర్ల దూరం ఉన్న బకింగ్‌హాం కెనాల్ జల మార్గాన్ని పూర్తి స్థాయిలో సరకు రవాణాకు అనుకూలంగా మార్చే లక్ష్యంతో కాలువను కేంద్రం రెండుసార్లు సర్వే చేయించింది.

    కాలువ రూపురేఖలు, ఆక్రమణలను గుర్తించి సుమారు రూ. 542 కోట్లతో అభివృద్ధి పరచాలని అంచనావేసింది. ఇందుకోసం ఓ ఐఏఎస్ అధికారి, చీఫ్ ఇంజినీర్, సర్వే, ట్రాన్స్‌పోర్ట్ విభాగం అధికారులను కేటాయించింది. ఈ నేపధ్యంలో కేంద్ర జల రవాణా చీఫ్ ఇంజనీర్ దండపత్, సీనియర్ హై డ్రోలాజికల్ సర్వేయర్ సి.వి.ప్రసాద్‌లు రెండు రోజుల కిందట విజయవాడ ఇరిగేషన్ కార్యాలయంలో జల రవాణా కార్యాలయాన్ని ప్రారంభించారు. శుక్ర, శనివారాల్లో బకింగ్‌హాం కాలువపై పర్యటించి స్థితిగతుల్ని పరిశీలించారు.
     
    మొదట డ్రెడ్జింగ్ పనులు...

    బకింగ్‌హాం కాలువ రూపురేఖలు విజయవాడ నుంచి పెద గంజాం వరకూ బాగానే ఉన్నాయి. అక్కడి నుంచి కృష్ణపట్నం వరకూ స్వరూపమే మారిపోయింది. చాలా చోట్ల ఆక్రమణలు పెరిగి కుచించుకుపోయింది. ఈ ఆక్రమణలను తొలగించి, అవసరమైన చోట వంతెనలు, ప్రత్యేక నిర్మాణాలు నిర్మించాల్సి ఉంది. కాలువ పక్కనే నిర్మించే టెర్మినల్స్ వరకూ సరకు తెచ్చేందుకు  రోడ్లను కూడా నిర్మించాల్సి ఉంది.

    మార్చిలోగా దీన్ని పూర్తి చేసి ఆ తరువాత పెదగంజాం నుంచి కృష్ణపట్నం వైపు డ్రెడ్జింగ్ పనులు మొదలు పెట్టనుంది. కేంద్రం నుంచి విజయవాడ వచ్చిన చీఫ్ ఇంజనీర్ దండపత్ మంత్రి దేవినేనితో దీనిపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కాలువవల్ల పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందే  అవకాశం ఉంది.
     

మరిన్ని వార్తలు