మాదే కులం?

26 Sep, 2018 13:45 IST|Sakshi
ఆళ్లగడ్డ పట్టణంలో నివసిస్తున్న బుడగజంగాలు

8 ఏళ్లుగా వేడుకుంటున్న బుడగజంగాలు  

తేల్చని అధికారులు, పాలకులు

నంద్యాల ఎన్నిక సమయంలో కమిషన్‌ వేసి చేతులు దులుపుకున్న ప్రభుత్వం  

కుల ధ్రువీకరణ పత్రం లేక ఉన్నత విద్యకు దూరమవుతున్న బుడగజంగాల పిల్లలు

వీరంతా బుడగజంగాలోళ్లు.. ఒకప్పుడు ఊరూరా తిరిగి యాచించే వారు.. ఇప్పుడు బిందెలు, ఆట బొమ్మలు తదితరాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. అలాంటి వీరికి పిల్లలను చదివించుకోవాలన్నా.. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా కుల ధ్రువీకరణ పత్రమడుగుతున్నారు. ఆ సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు అధికారులు, పాలకులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. వారి కులమేదో తేల్చకుండా ఏళ్ల తరబడి నాన్చుతున్నారు.

కర్నూలు, ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణ శివారులోని సద్దాం కాలనీ వెనుక వైపున 30 సంవత్సరాల నుంచి 200 బుడగ జంగాల కుటుంబాలు నివాసముంటున్నాయి.వీరు పిల్లలను స్థానిక స్కూళ్లలో చదివించుకుంటున్నారు. కొందరు చదువులో మంచి ప్రతిభ సైతం కనబరుస్తున్నారు. అయినా, వీరికి స్కాలర్‌షిప్, హాస్టల్‌ వసతి, ఉచిత పుస్తకాలు అందని పరిస్థితి నెలకొంది. అవి పొందాలంటే  కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా తీసుకురావాలని విద్యాసంస్థల నిర్వాహకులు తెగేసి చెబుతున్నారు. బుడగ జంగాలకు చెందిన తాము ఎస్సీ కేటగిరీ కిందకు వస్తామని తహసీల్దార్‌ కార్యాలయాలకెళ్లి దరఖాస్తు చేసుకుంటే  వారు పట్టించుకోవడం లేదు. గెజిట్‌లో జిల్లాలో ఎక్కడా బుడగజంగాల కులమే లేదని, దీంతో మీరు ఎస్సీ కాదని తిరస్కరిస్తున్నారు. కనీసం బీసీ కుల ధ్రువీకరణ పత్రాలైనా ఇవ్వమంటే అందుకు అంగీకరించడం లేదు. దిక్కుతోచని పరిస్థితిలో తల్లిదండ్రులు తమ పిల్లల చదువును మధ్యలో ఆపివేసి పనులకు తీసుకెళ్తున్నారు.

వైఎస్సార్‌ మరణంతో ఇబ్బందులు
రాష్ట్రంలోని కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో  బుడగజంగాల కులస్తులు అత్యధికంగా నివసిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 60 వేల మంది దాకా ఉన్నారు. వీరందరినీ ఎస్సీలుగా గుర్తిస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి జీఓ జారీ చేశారు.  అప్పటికప్పుడు ఎస్సీ  ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేశారు. ఆయన మరణానంతరం బుడజంగాలు కేవలం తెలంగాణలో మాత్రమే ఉన్నారని, ఏపీలో ఎక్కడా  లేరని ప్రభుత్వం అనాలోచితంగా జీఓ నంబర్‌ 44 విడుదల చేసింది. అప్పటి నుంచి అధికారులు వీరికి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీని నిలిపి వేశారు. అయితే, తమదేకులమో తేల్చమని గత కొన్నేళ్లుగా వారు ప్రభుత్వకార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్కరూ పట్టించుకున్న దాఖలాలు లేవు.

బాబు కమిషన్‌ ఏమైందో ?  
నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా రాష్ట్రంలోని బుడజంగాల నాయకులు ప్రతిపక్ష నేత వైఎస్‌జగన్‌ మోహన్‌రెడ్డిని కలుసుకుని కలిసి తమ సమస్య  వివరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో  నంద్యాలలో  వారికున్న  5 వేలకు పైగా ఓట్లు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కడ పడుతాయోనని ఉలిక్కిపడ్డ చంద్రబాబునాయుడు అప్పటికప్పుడు కుల నిర్ధారణకు కమిషన్‌ వేస్తానన్నారు. అంతేకాదు వారం పదిరోజుల్లో  ఆ కమిషన్‌ పూర్తి నివేదిక ఇస్తుందని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు.  ఇప్పటికీ ఏడాది గడిచినా   అతీగతీ లేదు.

మరిన్ని వార్తలు