విభజన హామీల ఊసే లేదు

2 Feb, 2020 14:12 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఐదేళ్లుగా పోలవరానికి నిధుల కేటాయింపు కోసం ఎదురు చూస్తున్నా బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుద్ధా నాగేశ్వరరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండి చేయి చూపిందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్‌ కేటాయింపుల వల్ల 13 జిల్లాల ప్రజలు నిరాశలో ఉన్నారన్నారు. వ్యవసాయాధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు నిధులు కేటాయించాల్సిందని అభిప్రాయపడ్డారు. విభజన హామీల అమలు బాధ్యత కేంద్రానిది.. కానీ బడ్జెట్‌లో వాటి ఊసే ఎత్తలేదని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్‌పై ఒక్క ప్రకటన కూడా చేయలేదన్నారు. పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాను కూడా తగ్గించారని పేర్కొన్నారు.

‘చిన్న రాష్ట్రాలపై సానుకూలంగా ఉండే బీజేపీ.. ఏపీకి న్యాయం చేయాలి. రాజధాని అభివృద్ధికి నిధులు కేటాయించాలి. విమానాశ్రయాలు కేటాయించాలి. తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నందున కేంద్రం నూతన పోర్టుల ఏర్పాటుకు సహకరించాలి. గతంలో టీడీపీ.. బీజేపీతో మిత్ర పక్షంగా ఉన్నా రాష్ట్రానికి నిధులు రాబట్టలేదు. చంద్రబాబు ఓటుకు నోటుకేసులో ఇరుక్కుని  కేంద్రాన్ని నిధులు అడగలేదు. ప్రత్యేక హోదా అంశాన్ని నిర్వీర్యం చేసిన వ్యక్తి చంద్రబాబు. ప్రత్యేక ప్యాకేజికి ఒప్పుకుని రాష్ట్రానికి చంద్రబాబు అన్యాయం చేశారు. ఎన్నికల ముందు బీజేపీని విమర్శించిన టీడీపీ బడ్జెట్ అంశంలో ఇప్పుడెందుకు ప్రశ్నించడం లేదు. చంద్రబాబు అవకాశవాద రాజకీయలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశార’ని బుద్ధా నాగేశ్వరరావు మండిపడ్డారు.

మరిన్ని వార్తలు