మార్చి 1లోగా స్పీకర్‌కు నివేదిక

28 Jan, 2016 02:29 IST|Sakshi

అసెంబ్లీ ఘటనలపై బుద్ధప్రసాద్ కమిటీ సమావేశం
రోజా సస్పెన్షన్ నిబంధనలకు విరుద్ధమన్న వైఎస్సార్‌సీపీ


 సాక్షి, హైదరాబాద్: శాసనసభలో గత నెల 22న జీరో అవర్‌లో సభ్యులు ప్రస్తావించిన అంశాలతోపాటు వీడియో ఫుటేజీ లీకే జీపై ఏర్పాటు చేసిన మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలోని కమిటీ ఫిబ్రవరి 5వ తేదీన మరోసారి సమావేశమై, నివేదికను రూపొందించనుంది. మార్చి 1వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలోగా స్పీకర్‌కు నివేదికను అందించనుంది. కమిటీ సమావేశం మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన బుధవారం జరిగింది. కమిటీ పలు వీడియోలను వీక్షించింది. శాసనసభ సమావేశాల దృశ్యాలు కొన్ని బహిర్గతం కావడంపై అధికారులను వివరణ కోరింది. దీనిపై అధికారులు స్పందిస్తూ అసెంబ్లీ దృశ్యాలు సామాజిక మాధ్యమాలకు ఎలా చేరాయో తమకు తెలియదని స్పష్టం చేసినట్లు సమాచారం.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ సభ్యురాలు ఆర్‌కే రోజా సస్పెన్షన్ నిబంధనలకు విరుద్ధమని ఆ పార్టీ తరపున కమిటీలో సభ్యుడైన శ్రీకాంత్‌రెడ్డి వాదించారు. నిబంధనల ప్రకారం రోజాను ఆ సమావేశాల వరకూ, లేదంటే సమావేశాల్లో కొన్ని రోజులు మాత్రమే సస్పెండ్ చేయాలన్నారు. అయితే బుద్ధప్రసాద్ సహా మిగిలిన సభ్యులు మాత్రం రోజా సస్పెన్షన్ వ్యవహారం కమిటీ పరిధిలో లేదని అడ్డుకున్నట్లు సమాచారం. సభలో రోజా ఒక్కరే అనుచిత వ్యాఖ్యలు చేశారన్నట్లుగా చిత్రీకరించడం సరికాదని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రికార్డుల్లోకి ఎక్కేవిధంగా చేసిన అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు, రికార్డుల్లోకి ఎక్కేందుకు వీలు కాకుండా చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన కమిటీ ముందు ఉంచినట్లు తెలిసింది.

>
మరిన్ని వార్తలు