బుడ్డోడూ.. పది లచ్చలు!

22 Nov, 2014 07:26 IST|Sakshi
బుడ్డోడూ.. పది లచ్చలు!

ఓరి బుడ్డోడా ఇంత డబ్బు నీకెక్కడిదిరా.. ఏందిరా ఎక్కడన్నా కన్నం వేశావా ఏంది...  ఇలా రా.. ఈడ కూకో... ఆ మూట విప్పు.. ఏందిరా ఇన్ని కట్టలు.. లచ్చలు లచ్చలు ఉన్నట్టు ఉన్నాయిగందరా.. ఓరి నాయనో నాకేదో భయమేస్తుందిరా.. పదపద.. ముందు మీ ఆసామి దగ్గరకు పోదాం పదా..!
 
ఈ సంభాషణ చదువుతుంటే పల్లెటూరి చిన్నోడి వద్ద ఉన్న డబ్బు గురించి ఓ తల్లి ఆరా తీస్తూ భయపడుతున్నట్టు ఉంది గదా.. ఔను నిజమే.. ఆ బుడ్డోడి వద్ద లక్షలాది రూపాయలు ఉన్నమాట నిజమే. వాడు ఆసామి వద్ద పనిచేస్తున్న మాటా నిజమే.. అయితే, ఆ తల్లి భయపడినట్టు వాడు దొంగతనం చేయలేదు.. మరో నేరమో చేయలేదు.. వాడు చేసింది జస్ట్ బిజినెస్.. వచ్చిపడింది పది లక్షలు.

అక్షరాలా పదిలక్షల రూపాయలు. ఆశ్చర్యంగా ఉందిగదా. ఎస్.. ఓ చిన్న కుర్రోడు అంతమొత్తం ఎలా సంపాదించాడనేగా మీ డౌట్.. అయితే, ఓసారి రాజధాని నిర్మించతలపెట్టిన గ్రామాల్లో జరుగుతున్న భూముల బిజినెస్‌పై ఓ లుక్కేయండి. కోట్లలో పలుకుతున్న భూముల ధరలు మధ్యవర్తులను లక్షాధికారులను చేస్తున్నాయి. ఎకరా పొలం అమ్మితే రైతుతో పాటు కోనుగోలుదారులు ఇచ్చే కమీషన్ నాలుగు శాతం జేబులో పడుతోంది. ఇప్పుడక్కడ ఎకరా ధర కోటి పై మాటే.. ఈ లెక్కన నాలుగు లక్షలు కమీషన్ రూపంలో వస్తున్నాయి.
 
అంటే రైతు వద్ద కోటీ పది లేదా కోటీ ఇరవై లక్షలకు బేరం కుదుర్చుకుని వేరే వారికి కోటీ నలబై లక్షలకు అమ్ముకోవడం అన్నమాట. ఈ వ్యవహారంలో ఎకరాకు పది నుంచి రూ.20 లక్షలు సంపాదిస్తున్న మధ్యవర్తులూ ఉన్నారు. ఆ గ్రామాల్లో పొలం పనులు చేసే కుర్రకారు నలుగురైదుగురు పోగై మారు బేరాలు చేస్తున్నారు. ఆ నలుగురిలో చిన్నారావు ఒకడు. స్నేహితులతో కలిసి రెండెకరాలు మారు బేరం చేయడంతో అతడికి దక్కిన డబ్బు పది లక్షలు. ఇలా అందరికీ వస్తున్నాయని కాదు సుమా.. రియల్ బిజినెస్‌లో ఇదో కోణం మాత్రమే. ఒక్కోసారి అదృష్టం అలా వరించేసింది మరి.    

- గుంటూరు డెస్క్
 

మరిన్ని వార్తలు